తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

May 29, 2026 9:59 AM

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మే నెల మొత్తం తిరుమలలో వేసవి రద్దీ స్పష్టంగా కనిపించింది. ప్రతి రోజూ కంపార్ట్‌మెంట్లు నిండిపోతుండగా, క్యూ లైన్లు బయట వరకు విస్తరిస్తున్నాయి. దర్శనానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

రోజూ 80 వేల మందికి పైగా భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

సహజంగా ప్రతి వేసవిలో తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఆధ్యాత్మిక, ప్రశాంత వాతావరణం ఉండటంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన వెంటనే, పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది.

తిరుపతిలోని అలిపిరి వద్ద కూడా భక్తుల రద్దీ అధికంగా కనిపిస్తోంది. రోజూ దాదాపు 10 వేల సొంత వాహనాలు తిరుమలకు చేరుతున్నాయి. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.

ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూ లైన్ శిలాతోరణం వరకు విస్తరించింది. ఉదయం టోకెన్లు లేకుండా సర్వదర్శన క్యూ లైన్‌లో ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం కలగడానికి 15 నుంచి 20 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

నిన్న 74,569 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 46,292 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.80 కోట్లు నమోదైంది. లడ్డూ విక్రయాలు 4.15 లక్షలకు చేరాయి. అన్నప్రసాదం కోసం 2.70 లక్షల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media