విద్యార్థినులకు.. ‘మెన్‌స్ట్రువల్ లీవ్స్’

May 29, 2026 1:27 PM
Schoolgirls in Kerala as the state plans monthly menstrual leave and women-friendly welfare initiatives.

మహిళలు, బాలికల సంక్షేమం కోసం కేరళలోని నూతన యూడీఎఫ్ (UDF) ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు ప్రకటించింది. రాష్ట్రంలో బాలికలకు ప్రతి నెలా మూడు రోజుల పాటు ‘మెన్‌స్ట్రువల్ లీవ్’ మంజూరు చేయడంతో పాటు, 50 మంది కంటే ఎక్కువ ఉద్యోగులున్న కార్యాలయాల్లో తప్పనిసరిగా డేకేర్ సెంటర్లు, క్రెచ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ చదివిన నూతన వి.డి. సతీశన్ ప్రభుత్వ విధాన ప్రసంగంలో ఈ కీలక ప్రకటనలు చోటుచేసుకున్నాయి.

‘ప్రాజెక్ట్ మెన్‌స్ట్రువల్ డిగ్నిటీ’

బాలికలు, మహిళలకు విద్యాసంస్థలు మరియు బహిరంగ ప్రదేశాలను మరింత అనుకూలంగా మార్చేందుకు ప్రభుత్వం “ప్రాజెక్ట్ మెన్‌స్ట్రువల్ డిగ్నిటీ”ని ప్రారంభించనుంది.

“మా ప్రభుత్వానికి బాలికల విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఉంది. ఇందులో భాగంగానే పాఠశాల విద్యార్థినులకు నెలకు మూడు రోజుల వరకు రుతుస్రావ సెలవులు ఇవ్వాలని యోచిస్తున్నాము. అయితే, ఈ సెలవుల వల్ల వారు చదువులో వెనుకబడకుండా ఉండేందుకు వీకెండ్స్‌లో (శని, ఆదివారాల్లో) స్పెషల్ క్లాసులు కూడా నిర్వహిస్తాం” అని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

50 మంది ఉద్యోగులు దాటితే ‘డేకేర్’ తప్పనిసరి!
మహిళా ఉద్యోగుల సౌకర్యార్థం ప్రసూతి ప్రయోజనాల చట్టం-1961 (Maternity Benefit Act) ప్రకారం ప్రభుత్వం కొత్త ‘చైల్డ్ కేర్ రూల్స్’ తీసుకురానుంది. దీని ప్రకారం.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, ఐటీ పార్కులు. 50 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న ప్రతి ప్రైవేట్ మరియు ప్రభుత్వ సంస్థలో సురక్షితమైన, అత్యాధునిక డేకేర్ సెంటర్లు ఏర్పాటు చేయడం ఇకపై తప్పనిసరి.

అనాథ రహిత కేరళ
భారతదేశంలోనే మొట్టమొదటి “అనాథ రహిత రాష్ట్రం”గా కేరళను తీర్చిదిద్దేందుకు ‘డెస్టిట్యూట్ అండ్ ఆర్ఫన్-ఫ్రీ కేరళ’ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఆధారంగా దత్తత కార్యక్రమాలను ప్రోత్సహించడం, శిక్షణ పొందిన పెంపుడు కుటుంబాల నెట్‌వర్క్‌ను నిర్మించి వారికి తగిన ఆర్థిక సాయం అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.

మహిళల కోసం మరికొన్ని కీలక ప్రకటనలు:
పని ప్రదేశాల్లో మహిళలకు పురుషులతో సమానంగా వేతనాలు అందేలా చర్యలు.


అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలకు ప్రత్యేక ప్రయోజనాలతో పాటు 6 నెలల ప్రసూతి సెలవులు (Maternity Leave).


కేరళలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో అత్యాధునిక పబ్లిక్ రెస్ట్‌రూమ్ సౌకర్యాలు.


మహిళలకు శానిటరీ నాప్‌కిన్లు, పాదరక్షలు మరియు ఇతర నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక చర్యలు.


దేశంలోనే మహిళా స్నేహపూర్వక రాష్ట్రంగా కేరళను అగ్రస్థానంలో నిలబెట్టడమే ఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గవర్నర్ స్పష్టం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media