రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు సుప్రీంకోర్టులో ఊరట

May 29, 2026 3:27 PM

న్యూఢిల్లీ: ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు ఊరటనిస్తూ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2026 ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్‌లో పాల్గొనేందుకు ఆమెకు అనుమతి ఇచ్చింది. అయితే ఆమె పాల్గొనడాన్ని సవాల్ చేస్తూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) దాఖలు చేసిన పిటిషన్‌పై వినేష్ సమాధానం ఇవ్వాలని కూడా ఆదేశించింది.

వినేష్ ట్రయల్స్‌లో పాల్గొనడానికి అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును డబ్ల్యూఎఫ్‌ఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం ముందు ప్రత్యేక అనుమతి పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) దాఖలైంది. డబ్ల్యూఎఫ్‌ఐ విధానంలో పేర్కొన్న అర్హత ప్రమాణాలు నెరవేర్చలేదని పేర్కొంటూ, హైకోర్టు తీర్పును ఫెడరేషన్ ప్రశ్నించింది.

గత వారం ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు, మాతృత్వాన్ని “వైకల్యం”గా లేదా వృత్తిపరమైన అవకాశాలను నిరాకరించే కారణంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మే 30, 31 తేదీల్లో జరిగే ఎంపిక ట్రయల్స్‌లో వినేష్‌ను పాల్గొననివ్వాలని డబ్ల్యూఎఫ్‌ఐకి ఆదేశాలు ఇచ్చింది.

వినేష్‌కు అనుకూలంగా తీర్పు చెబుతూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “ఇది మరెవరైనా అయితే పరిస్థితి వేరుగా ఉండేది. ఆమె దేశానికి గర్వకారణంగా నిలిచారు” అని ధర్మాసనం పేర్కొంది.

డబ్ల్యూఎఫ్‌ఐ తరఫు న్యాయవాదిని ఉద్దేశించి, “హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఆశలు, అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ఆమెను ఇంటికి వెళ్లిపోమని చెప్పడం సరైంది కాదు. ఈ విషయంలో మేము స్పష్టంగా చెబుతున్నాం” అని వ్యాఖ్యానించింది.

అయితే హైకోర్టు వ్యవహారాన్ని నిర్వహించిన తీరుపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. క్రీడలకు సంబంధించిన అంశాల్లో తరచూ, వేగంగా న్యాయ జోక్యం ఉండటం సమస్యాత్మకమని పేర్కొంది.

“ఇవి మెడికల్ కాలేజీ ప్రవేశాలు కావు. ఇవి జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు సంబంధించిన అంశాలు. ఈ విధంగా జోక్యం చేసుకుని మొత్తం షెడ్యూల్‌ను అస్తవ్యస్తం చేయకూడదు” అని జస్టిస్ నరసింహ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు.

వినేష్‌కు ట్రయల్స్‌లో పాల్గొనే అవకాశం కల్పించిన సుప్రీంకోర్టు, డబ్ల్యూఎఫ్‌ఐ పిటిషన్‌పై వచ్చే వారం పూర్తి స్థాయి విచారణ చేపట్టనుంది. అదే సమయంలో ఫెడరేషన్ అభ్యంతరాలపై వినేష్ ఫొగాట్ సమాధానం దాఖలు చేయాలని ఆదేశించింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media