ఆంధ్రప్రదేశ్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగింది. గత 20 రోజులుగా తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. మాడవీధులు గోవింద నామస్మరణలతో మారుమోగుతున్నాయి. ఈ వేసవిలో గతంలో ఎన్నడూ లేనంతగా భక్తుల రద్దీ కనిపిస్తోంది. శ్రీవారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది.
భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే నెల నుంచి వేసవి సెలవులు ముగియనుండటం, విద్యాసంస్థలు ప్రారంభం కానుండటంతో తిరుమలకు వచ్చే వారి సంఖ్య మరింత పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రతిరోజూ క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోతున్నాయి. దీంతో బయట వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉండాల్సి వస్తోంది. గంటల తరబడి నిరీక్షించిన తర్వాతే శ్రీవారి దర్శనం లభిస్తోంది. ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు మొక్కులు చెల్లించుకునేందుకు నేరుగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరిగిందని టీటీడీ అధికారులు తెలిపారు.
శనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం కోసం టోకెన్లు లేకుండా ఉదయం క్యూ లైన్లో ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పొందేందుకు సుమారు 24 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
శుక్రవారం 78,389 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 45,283 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అదే రోజు హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. లడ్డూ విక్రయాలు 4.07 లక్షలకు చేరగా, అన్నప్రసాదాన్ని 2.94 లక్షల మంది స్వీకరించినట్లు వెల్లడించారు.

