400 కిలోల బంగారం దోపిడీ.. సుభోధ్ సింగ్ నేరాల చిట్టా భారీ!

May 30, 2026 3:46 PM

హైదరాబాద్: బీహార్‌కు చెందిన సుభోధ్ సింగ్ పేరు వినగానే పోలీసులు అప్రమత్తమవుతారు. బంగారం దోపిడీల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్న ఈ కరడుగట్టిన నేరగాడు దేశంలోని పలు రాష్ట్రాల్లో వందలాది నేరాలకు పాల్పడినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఇటీవల కరీంనగర్ జిల్లాలో జరిగిన నగల దుకాణం దోపిడీ కేసులో సుభోధ్ సింగ్ ప్రధాన నిందితుడిగా తేలాడు. ప్రస్తుతం అతడు కరీంనగర్ జైలులో ఉన్నాడు.

సుభోధ్ సింగ్ ప్రత్యేకంగా తనకంటూ ఒక గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఒడిశా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్, తెలంగాణ రాష్ట్రాల్లో దోపిడీలు, హత్యలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అతడిపై పలు రాష్ట్రాల్లో హత్య, దోపిడీ కేసులు నమోదయ్యాయి. అతడి నేర చరిత్ర చూస్తేనే అతడు ఎంత ప్రమాదకర నేరగాడో అర్థమవుతుంది.

ఇప్పటి వరకు బ్యాంకులు, నగల దుకాణాలు, ప్రైవేటు వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుని అనేక దోపిడీలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. సుభోధ్ సింగ్ ఇప్పటి వరకు సుమారు 400 కిలోల బంగారాన్ని దోచుకెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. అతడి ప్రత్యేకత ఏమిటంటే బంగారాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం. ఇతర విలువైన వస్తువుల జోలికి వెళ్లడని పోలీసులు చెబుతున్నారు.

సుభోధ్ సింగ్ నేరాల తీరు కూడా భిన్నంగా ఉంటుంది. నేరుగా దుకాణాలకు వెళ్లడం, తుపాకులతో బెదిరించడం, అవసరమైతే కాల్పులు జరపడం, పరిస్థితులు తీవ్రంగా మారితే హత్యలకు కూడా వెనుకాడకపోవడం అతడి నేరశైలిగా గుర్తించారు. బంగారం కోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధపడతాడని అధికారులు చెబుతున్నారు.

దోపిడీల్లో కొల్లగొట్టిన బంగారాన్ని బీహార్‌లోని నగల వ్యాపారులకు విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. జైలులో ఉన్న సమయంలో కూడా తన గ్యాంగ్‌కు సూచనలు ఇస్తూ దోపిడీలు చేయిస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగానే లక్ష్యాలను గుర్తించి ప్రణాళికలు రూపొందించడం, గ్యాంగ్‌ను పంపించడం, దోపిడీ అనంతరం పలు రాష్ట్రాలు మారుతూ చివరకు బీహార్ చేరుకోవడం వారి కార్యకలాపాల విధానంగా గుర్తించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media