అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై నేరాల నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ‘ఆపరేషన్ దండాయన’ను ప్రారంభించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి కేసులో 60 రోజుల్లోపు ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించారు.
అత్యాచారం, లైంగిక వేధింపులు, వెంటాడటం, పోక్సో కేసులపై ప్రత్యేక నిఘా ఉంటుంది. కేసుల దర్యాప్తు, కోర్టు విచారణల పురోగతిని పర్యవేక్షించేందుకు స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ వ్యవస్థను తీసుకురానున్నారు.
మహిళలపై నేరాలకు పాల్పడిన అలవాటు నేరస్థులను ఫేషియల్ రికగ్నిషన్, జియో ట్యాగింగ్ సాంకేతికతలతో నిరంతరం గమనిస్తారు. లైంగిక నేరాల చరిత్ర ఉన్న వారి కదలికలను నమోదు చేస్తారు.
డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ మహిళలపై నేరాల విషయంలో ‘జీరో టాలరెన్స్’ విధానం అమలు చేస్తామని చెప్పారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక పలుకుబడి ఉన్నా నేరస్థులపై కఠిన చర్యలు తప్పవన్నారు.
బాధిత మహిళలకు న్యాయ సాయం, కౌన్సెలింగ్, మానసిక సహాయం అందించనున్నారు. గ్రామాలు, పట్టణాల్లో నెయిబర్‌హుడ్ వాచ్ కార్యక్రమాన్ని విస్తరించి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. పాఠశాలలు, కళాశాలలు, మహిళా సంఘాల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.

