విశాఖ జిల్లా గాజువాకలో ఈ రోజు వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగివున్న లారీని ఏపీఎస్ ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్‌తో సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
రాజమహేంద్రవరం నుంచి 30 మంది ప్రయాణికులతో పార్వతీపురం వెళ్తున్న సమయంలో ఆర్టీసీ బస్సు వేకువజామున 4 గంటల సమయంలో గాజువాక శ్రీనగర్ వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. బస్సు డ్రైవర్ రాంబాబు, ప్రయాణికురాలు ఈశ్వరమ్మతో పాటు మరో గుర్తుతెలియని మహిళ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

