ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్ నేడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు జట్లు తమ రెండో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలని అనుకుంటున్నాయి. గతేడాది ఇదే వేదికపై పంజాబ్ కింగ్స్‌ను ఓడించి తమ దశాబ్దాల టైటిల్ కలను నెరవేర్చుకున్న ఆర్సీబీ, డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఐదేళ్లలో ఇది మూడో ఫైనల్. 2022లో అరంగేట్రం చేసిన తొలి సీజన్లోనే విజేతగా నిలిచిన గుజరాత్, 2023 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది.
మ్యాచ్ జరిగే అహ్మదాబాద్‌లో ఆదివారం వర్షం పడే అవకాశం కేవలం 5 శాతమే. ఒకవేళ అనుకోని రీతిలో వర్షం అంతరాయం కలిగిస్తే.. ఫైనల్ కోసం బీసీసీఐ జూన్ 1న రిజర్వ్ డేను కేటాయించింది. ఆదివారం ఆట ఎక్కడైతే ఆగిపోతుందో, సోమవారం అక్కడి నుంచే తిరిగి ప్రారంభిస్తారు. ఆదివారం, సోమవారం రెండు రోజులూ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే, లీగ్ దశలో పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో నిలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఈ నిబంధన ప్రకారం ఆర్సీబీ టైటిల్ కైవసం చేసుకుంటుంది.

