తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధినేత చంద్రబాబు తప్పుపట్టారు. చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాల గురించి మాట్లాడేటప్పుడు నేతలు సంయమనం పాటించాలని, ఎవరి మనోభావాలను దెబ్బతీయకూడదని ఆయన హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డపై అని గుర్తుచేశారు. తెలుగు జాతి ఒక్కటేనని, తెలంగాణలో పార్టీకి బలమైన క్యాడర్ ఉందని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లుపై కేంద్ర ప్రభుత్వం పట్టుదలగా ఉందని, అవి దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తెస్తాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ఇక వైసీపీ మీద కూడా సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ‘గొడ్డలి పార్టీ’ అనే పేరు ప్రజల్లోకి బలంగా వెళుతుండటంతో వారిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందని, వైఎస్ కుటుంబ అరాచకాలు తమకు కూడా పూర్తిగా తెలియవని, ఇలాంటి వారు ప్రజాస్వామ్యానికి పనికిరారన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత చేస్తున్న పోరాటానికి చంద్రబాబు మద్దతు తెలిపారు.

