అమరావతి/విశాఖపట్నం: విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ నేటి నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. భారతీయ రైల్వేలో ఇది 18వ జోన్‌గా ఉండనుందని రైల్వే అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం గతంలోనే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా ఏర్పాట్లు పూర్తికావడంతో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ నేటి నుంచి అధికారికంగా అందుబాటులోకి రానుంది.
ఈ జోన్ ఏర్పాటుతో రైల్వే పరిపాలన మరింత సులభం కావడంతో పాటు రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా సేవలు విస్తరించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రారంభంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకుందని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ కార్యరూపం దాల్చడంలో సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

