హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులర్పించి, పరేడ్ గ్రౌండ్స్‌లో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడిన ఆయన, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని చెప్పారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా బస్సులు, పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలు అప్పగించామని అన్నారు.
పేదలకు సొంత ఇల్లు కల నెరవేర్చేందుకు లక్షలాది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని, ఇటీవలే పెద్ద ఎత్తున ఇళ్ల ప్రారంభోత్సవాలు నిర్వహించామని చెప్పారు.
రైతులకు వరి బోనస్ ప్రకటించడంతో పాటు ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 63 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని చెప్పారు.
నిధులు, నీళ్లు, నియామకాల లక్ష్యాలతో ఏర్పడిన తెలంగాణలో ఆ మూడు అంశాల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని రేవంత్ రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ నీటి సమస్యలను పరిష్కరిస్తున్నామని, ఈ వేసవిలో కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించామని చెప్పారు. అలాగే కార్మికుల కనీస వేతనాలు పెంచామని, ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను కూడా సాధ్యమైనంత మేర నెరవేర్చామని తెలిపారు.

