హైదరాబాద్, నారాయణపేట: తెలంగాణలోని నారాయణపేట పట్టణంలో ఓ బాలిక ఆత్మహత్య ఘటనపై బీజేపీ, వీహెచ్‌పీ పిలుపునిచ్చిన బంద్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరో మతానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో మోసం చేసి, మతం మార్చుకోవాలని ఒత్తిడి తెచ్చాడని ఆ సంస్థలు ఆరోపించాయి.
ఈ కేసులో నిందితుడు ఫాసియుద్దీన్ (18)ను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం, పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
బంద్ సందర్భంగా బీజేపీ, వీహెచ్‌పీ కార్యకర్తలు ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళనకు దిగగా పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. బంద్ వల్ల దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి.
ఈ ఘటనను కొందరు నేతలు “లవ్ జిహాద్”తో ముడిపెట్టినా, ఆ ఆరోపణలను పోలీసులు ధ్రువీకరించలేదు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని, ప్రజలు వదంతులు నమ్మవద్దని పోలీసులు సూచించారు.

