మాస్కో: ఉక్రెయిన్ డ్రోన్ దాడితో రష్యాలోని క్రాస్నోడార్ క్రాయ్ ప్రాంతంలోని ఇల్స్కీ చమురు శుద్ధి కర్మాగారంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జూన్ 1-2 మధ్య రాత్రి జరిగిన ఈ దాడిలో రిఫైనరీని లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు దాడి చేశాయని రష్యా అధికారులు తెలిపారు.
అధికారుల ప్రకారం, సమీపంలోని స్లావ్యాన్స్క్-ఆన్-కుబాన్ నగరంలోని ఓ నివాస భవన ప్రాంగణంలో కూడా డ్రోన్ శకలాలు పడ్డాయి. అయితే ప్రాణనష్టం జరగలేదని, అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారని చెప్పారు.
దక్షిణ రష్యాలోని అతిపెద్ద రిఫైనరీల్లో ఇల్స్కీ ఒకటి. సంవత్సరానికి 6.6 మిలియన్ టన్నుల ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం దీనికి ఉంది. రష్యా సైన్యానికి అవసరమైన ఇంధన సరఫరాలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది.
2022లో ఉక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభించిన తర్వాత ఈ రిఫైనరీపై కనీసం 16వ దాడి ఇదేనని ఏఎస్టీఆర్‌ఏ అనే స్వతంత్ర పరిశీలనా సంస్థ వెల్లడించింది.
ఇక మరోవైపు, బెల్గొరోడ్, బ్రయాన్స్క్, కుర్స్క్, రోస్టోవ్, స్మోలెన్స్క్, వోల్గోగ్రాడ్, క్రాస్నోడార్ ప్రాంతాలతో పాటు క్రిమియా, నల్ల సముద్రం, అజోవ్ సముద్రం ప్రాంతాల్లో మొత్తం 148 డ్రోన్లను కూల్చివేశామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

