అగ్ని ప్రమాదాల నివారణపై హైడ్రా దృష్టి
అమీర్‌పేట ఘటన తర్వాత చర్యల వేగం
కొత్త నిబంధనల అమలుకు ప్రభుత్వం కసరత్తు
హైదరాబాద్: నగరంలో తరచూ చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాల నివారణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ దిశగా సమగ్ర విధివిధానాలు రూపొందిస్తోంది. సంబంధిత శాఖల అధికారులతో ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. వచ్చే సోమవారం ఈ అంశంపై కీలక సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయాల ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
గురువారం అమీర్‌పేట మైత్రేయివనం సమీపంలోని వెస్ట్ శ్రీనివాసనగర్‌లో అగ్ని ప్రమాదానికి గురైన షాపింగ్ కాంప్లెక్స్‌ను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఘటనాస్థల పరిస్థితులను పరిశీలించి, సంబంధిత అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
పాత వైరింగ్.. అధిక విద్యుత్ వినియోగమే ప్రధాన కారణాలు
నగరంలోని అనేక భవనాల్లో పాత విద్యుత్ వైరింగ్ ఇప్పటికీ కొనసాగుతోందని రంగనాథ్ చెప్పారు. భవనాల సామర్థ్యానికి మించి విద్యుత్ వినియోగించడం వల్ల తరచూ షార్ట్ సర్క్యూట్లు ఏర్పడుతున్నాయని తెలిపారు.
వాటి కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు.
అమీర్‌పేటలో జరిగిన తాజా ఘటన విషయంలో రెండు కోణాల్లో విచారణ కొనసాగుతోందన్నారు. సమీపంలోని మెస్‌కు చెందిన చిమ్నీల నుంచి వచ్చిన నిప్పురవ్వల వల్ల మంటలు చెలరేగి ఉండొచ్చని ఒక వాదన ఉందన్నారు.
మరోవైపు షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చన్న అనుమానాలు కూడా ఉన్నాయని చెప్పారు. పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.
ఫైర్ ఎన్వోసీలపై ప్రత్యేక దృష్టి
అగ్ని ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు సిద్ధమవుతోందని హైడ్రా కమిషనర్ తెలిపారు.
ఫైర్ ఎన్వోసీల జారీ విధానంలో మార్పులు, క్రమానుగత తనిఖీలు, నిబంధనలు పాటించని యాజమాన్యాలపై చర్యలు వంటి అంశాలు కొత్త విధానంలో ఉండనున్నాయని చెప్పారు.
నగరంలోని అనేక భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, వాణిజ్య సముదాయాలకు ఫైర్ ఎన్వోసీలు లేవని పేర్కొన్నారు. అలాంటి భవనాలను గుర్తించి తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు.
అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
వరద కాలువలపై నిర్మాణాలకూ చెక్
వరద కాలువలపై నిర్మాణాల అంశాన్ని కూడా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోందని రంగనాథ్ తెలిపారు. వర్షాకాలంలో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపడతామని చెప్పారు.
కాలువలపై అక్రమ నిర్మాణాలు ఉంటే వాటిని గుర్తించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ప్రజల భద్రత, ఆస్తుల రక్షణ లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తోందన్నారు. అగ్ని ప్రమాదాల నివారణలో ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసేలా చర్యలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ఈ పరిశీలనలో హైడ్రా అదనపు సంచాలకుడు వర్ల పాపయ్య, ఆర్ఎఫ్వో జయప్రకాశ్, ఎస్ఎఫ్వోలు పాల్గొన్నారు.
Also Read

