కాలనీవాసుల ఆందోళనపై అధికారులతో కలిసి పరిశీలన
ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని సూచన
హైదరాబాద్: విడియా కాలనీ, ఎఫ్సీఐ కాలనీల్లో కొనసాగుతున్న నాలా పనులపై స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆందోళనల నేపథ్యంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు Konda Vishweshwar Reddy కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి Ravikumar Yadav రవికుమార్ యాదవ్ సంబంధిత అధికారులతో కలిసి ప్రాంతాన్ని సందర్శించారు.
విడియా కాలనీ, ఎఫ్సీఐ కాలనీల్లో చేపడుతున్న నాలా పనుల వల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం చేపడుతున్న పనులను నిలిపివేసి, గతంలో ఉన్న నాలాను విస్తరించి పునరుద్ధరణ పనులు చేపట్టాలని వారు కోరారు.
ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాలనీవాసులతో కలిసి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవికుమార్ యాదవ్ ప్రాంతంలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు.
స్థానికుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. నాలా నిర్మాణంపై ప్రజలు ఎదుర్కొంటున్న సందేహాలు, అభ్యంతరాలను విన్నారు.
అందరికీ అనుకూలంగా పరిష్కారం చూపాలి
ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ విడియా కాలనీ, ఎఫ్సీఐ కాలనీల ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు.
నాలా పనులపై ఎస్ఎన్డీపీ, ఇరిగేషన్ అధికారులు మరోసారి సమీక్ష నిర్వహించాలని సూచించారు.
నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలకు అండగా నిలిచే విధంగా పనులు చేపట్టకూడదని ఆయన అన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని అధికారులను కోరారు.
ప్రజల ప్రయోజనాలే ప్రాధాన్యం
రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు కమీషన్లు లేదా కొందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కాకుండా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని అన్నారు.
ప్రజలకు ఇబ్బందులు కలిగించే నిర్ణయాలు తీసుకోరాదని సూచించారు.
2023లో నాలా పునరుద్ధరణ పనుల పేరుతో శంకుస్థాపన చేసిన అధికారులు ఇప్పుడు కొత్త మార్గంలో పనులు చేపట్టాలని నిర్ణయించడం వెనుక కారణాలను ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రగతి ఎన్క్లేవ్, టాకీ టౌన్ రోడ్, విడియా కాలనీ, ఎఫ్సీఐ పార్క్ మీదుగా కొత్త నాలా నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఏమిటో స్పష్టం చేయాలని కోరారు.
నాలా పనుల విషయంలో ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించారు.
కాలనీవాసుల సమస్యల పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సమ్మెట ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, కేఎన్ఎల్ స్వామి, వెంకటేశ్వరరావు, ఎన్వీ రావు, సూర్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, మాధవ రెడ్డి, రవీందర్ రెడ్డి, లక్ష్మణ్, నాగుల్ గౌడ్, గణేష్ ముదిరాజ్, శ్రీనివాస్ యాదవ్, విజయేందర్, శ్రీనివాస్, రాము, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Also read

