Narayanguda లో ఘటన.. పోలీసులకు ఫిర్యాదు
రసాయనాల ప్రభావమా? ఇతర కారణాలున్నాయా? ఆరా
హైదరాబాద్, జూన్ 11: మామిడి పండ్లు తిన్న తర్వాత అస్వస్థతకు గురైన ఇద్దరు బాలికలు మృతి చెందిన ఘటన Narayanguda లో కలకలం రేపింది. ఈ ఘటనపై నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాలికల మరణానికి మామిడి పండ్లలోని రసాయనాలే కారణమా, లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం, కర్ణాటకలోని బీదర్‌కు చెందిన వైజినాథ్, ఇందుమతి దంపతులు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి నివసిస్తున్నారు. ఇటీవల నారాయణగూడ జలమండలి సమీపంలో మామిడి పండ్లు కొనుగోలు చేశారు. ఆ పండ్లను ఇందుమతితో పాటు ఆమె నలుగురు కుమార్తెలు తిన్నారు.
అదే రోజు వారికి తీవ్ర విరేచనాలు ప్రారంభమయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు వారిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 17 ఏళ్ల భువనేశ్వరి సోమవారం మృతి చెందింది. 10 ఏళ్ల సంధ్య మంగళవారం కన్నుమూసింది.
మిగిలిన వారు ఇంకా చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మామిడి పండ్లలో ఉపయోగించిన రసాయనాల ప్రభావం ఉందా, లేక ఇతర ఆరోగ్య కారణాలున్నాయా అన్న విషయాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. వైద్య నివేదికలు, నమూనాల పరీక్షల ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Also read



