డాలర్ వద్దు.. గోల్డ్ ముద్దు. ఆర్బీఐ గోల్డెన్ రికార్డు.

July 8, 2026 2:43 PM
RBI gold reserves continue to rise amid global uncertainty.

విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా గణనీయంగా పెరిగింది
ప్రపంచ ధోరణికి తగ్గట్టే గోల్డ్ కొనుగోళ్లు పెంచుతున్న భారత్

ప్రపంచవ్యాప్తంగా జియోపొలిటికల్ టెన్షన్లు, ఆర్థిక అనిశ్చితి నడుస్తున్న వేళ.. భారత రిజర్వు బ్యాంక్ సైలెంట్‌గా ఒక భారీ గోల్డ్ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో డాలర్ నమ్ముకుంటే ఎప్పటికైనా రిస్కే అని భావించిన ఆర్బీఐ.. వరుసపెట్టి టన్నుల కొద్దీ బంగారాన్ని కొనుగోలు చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద ఉన్న ఈ బంగారు నిల్వల విలువ అక్షరాలా 115.8 బిలియన్ డాలర్లు. మన రూపాయిల్లో దాదాపు రూ. 9.66 లక్షల కోట్లు. విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా గత ఏడాది కేవలం 12 శాతంగా ఉంటే, ఇప్పుడది ఏకంగా 17 శాతానికి పెరిగింది. అంటే భారత్ విదేశీ కరెన్సీ కంటే బంగారాన్నే అత్యంత సురక్షితమైన ఆస్తిగా భావిస్తోందని స్పష్టమవుతోంది.


అసలు ప్రపంచ దేశాలు డాలర్లను పక్కన పెట్టి గోల్డ్ వైపు పరుగెత్తడానికి మెయిన్ రీజన్.. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం. అమెరికా ఎప్పుడు ఏ దేశంపై ఆంక్షలు విధిస్తుందో, డాలర్ నిల్వలను ఎప్పుడు ఫ్రీజ్ చేస్తుందో తెలియని పరిస్థితి రావడంతో గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు రూట్ మార్చాయి. ఈ రేస్‌లో చైనా, పోలాండ్, చెక్ రిపబ్లిక్ లాంటి దేశాలు విపరీతంగా బంగారాన్ని కొనేస్తున్నాయి. డిమాండ్ ఏ రేంజ్‌లో పెరిగిందంటే.. 2024 ఆరంభంలో ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఒక ఔన్స్ బంగారం ధర 2 వేల డాలర్లు ఉంటే, ఇప్పుడు ఏకంగా 4 వేల డాలర్ల మార్క్‌ను టచ్ చేసి రికార్డులు బద్దలు కొట్టింది.


భారత విదేశీ మారక నిల్వల చరిత్రలోనే ఇంత భారీ స్థాయిలో బంగారాన్ని దాచి ఉంచడం ఇదే తొలిసారి. మన దేశ గోల్డ్ గ్రాఫ్ ఎలా పెరిగిందంటే …ఆర్బీఐ వద్ద ఉన్న గోల్డ్ నిల్వలు2015 లో 557.8 టన్నులు. అదే ప్రస్తుతం 2026లో 880.5 టన్నులు. ప్రపంచంలోనే అత్యధిక గోల్డ్ రిజర్వ్స్ ఉన్న అమెరికా, జర్మనీ, ఇటలీ, బ్రిటన్ లాంటి దేశాల లీగ్‌లోకి ఇప్పుడు ఇండియా కూడా దూసుకెళ్తోంది.


ఇప్పుడు అసలైన మైండ్ బ్లాకింగ్ మేటర్‌లోకి వద్దాం. ఆర్బీఐ దగ్గర ఉన్న 880 టన్నుల బంగారం ఒక ఎత్తయితే.. మన దేశంలోని ఇళ్లల్లో, దేవాలయాల లాకర్లలో ఆభరణాలు, బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం అంతకంటే కొన్ని రెట్లు ఎక్కువ. భారతదేశంలోని ఇళ్లు, గుళ్లలో ఉన్న మొత్తం బంగారం అక్షరాలా 32,000 టన్నులు. దీని విలువ మన రూపాయిల్లో చెప్పాలంటే ఊహకందని విధంగా రూ. 351.4 లక్షల కోట్లు.

అంటే.. ఆర్బీఐ మెయింటైన్ చేస్తున్న అఫీషియల్ గోల్డ్ నిల్వల కంటే మన ఇళ్లల్లో ఉన్న బంగారం ఏకంగా 36 రెట్లు ఎక్కువ. ప్రపంచంలో మరే దేశంలోనూ ప్రజల వద్ద గానీ, ప్రార్థనా స్థలాల్లో గానీ ఈ రేంజ్‌లో బంగారం నిల్వలు లేవు. ఇండియా తర్వాత సెకండ్ ప్లేస్‌లో ఉన్న దేశాల్లోని ప్రజల వద్ద కేవలం 20 వేల నుంచి 23 వేల టన్నుల వరకే గోల్డ్ ఉంది.

గ్లోబల్ మార్కెట్‌లో ఏ కరెన్సీ పడిపోయినా, ఎలాంటి ఆర్థిక సంక్షోభం వచ్చినా ఇండియా సేఫ్‌గా ఉండటానికి కారణం.. ఆర్బీఐ వ్యూహాత్మకంగా పెంచుతున్న నిల్వలు ఒకటైతే, భారతీయుల రక్తంలోనే ఉన్న గోల్డ్ సెంటిమెంట్ మరొకటి. అందుకే ప్రపంచ దేశాల్లో ఇళ్లల్లో బంగారం దాచడంలో మనల్ని కొట్టే మొనగాడే లేడు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media