ప్రైవేటీకరణ కాదు.. రాకెట్లు, శాటిలైట్ల తయారీలో ప్రైవేట్ సంస్థలకు ప్రాధాన్యం

September 7, 2026 1:27 PM

ప్రైవేటీకరణ వార్తలు అవాస్తవం

ఇస్రో ప్రైవేటీకరణపై వస్తున్న వార్తలకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పష్టత ఇచ్చింది. ఇస్రోను ప్రైవేటీకరించే ఉద్దేశం లేదని తేల్చి చెప్పింది.

సంస్థ ప్రాధాన్యతను తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ కంపెనీలు, స్టార్టప్‌లు, విద్యాసంస్థల భాగస్వామ్యాన్ని పెంచేందుకు చేపడుతున్న సంస్కరణలను ప్రైవేటీకరణగా చూడొద్దని తెలిపింది.

ఈ మేరకు ఆదివారం ఇస్రో అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఇటీవల ఇస్రోకు చెందిన పలు ఉద్యోగ సంఘాలు సంస్థ భవిష్యత్ పాత్రపై ఆందోళన వ్యక్తం చేశాయి.

ప్రస్తుతం ఇస్రో నిర్వహిస్తున్న రాకెట్లు, శాటిలైట్ల తయారీతో పాటు కొన్ని కార్యకలాపాలను ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించే ప్రతిపాదన ఉందంటూ వార్తలు వచ్చాయి.

దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు ఈనెల 4వ తేదీన ఇస్రో చైర్మన్ వి. నారాయణన్‌కు లేఖ రాశాయి.

ఇస్రో కీలక బాధ్యతలు కొనసాగుతాయి

ఉద్యోగులు, వారి కుటుంబాల్లో ఆందోళనకు కారణమైన వార్తలపై ఇస్రో వివరణ ఇచ్చింది.

అధునాతన అంతరిక్ష పరిశోధన, సాంకేతిక అభివృద్ధి, జాతీయ-వ్యూహాత్మక మిషన్లు, అంతరిక్ష శాస్త్రం, గ్రహాల అన్వేషణ, కీలక సాంకేతిక సామర్థ్యాల అభివృద్ధిలో ఇస్రోనే ప్రధాన సంస్థగా కొనసాగుతుందని పేర్కొంది.

ఇప్పటికే సాంకేతికంగా స్థిరపడిన వ్యవస్థలను భారీ స్థాయిలో తయారు చేసే బాధ్యతలను పరిశ్రమలు చేపడితే.. ఇస్రో తన శాస్త్రీయ, సాంకేతిక వనరులను మరింత అధునాతన పరిశోధనలపై కేంద్రీకరించగలదని వివరించింది.

భవిష్యత్తులో సాంకేతికంగా స్థిరపడిన రాకెట్లు, సాధారణ శాటిలైట్లు, ఇతర వ్యవస్థలను పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు పోటీ విధానంలో భారీ స్థాయిలో తయారు చేసే అవకాశం ఉందని ఇస్రో తెలిపింది. అయితే దీనివల్ల సంస్థ తన కీలక బాధ్యతల నుంచి తప్పుకుంటుందని అర్థం కాదని స్పష్టం చేసింది.

అధునాతన మిషన్లపై ఇస్రో ఫోకస్

ఫ్రాంటియర్ రీసెర్చ్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలు, మానవ సహిత అంతరిక్ష యాత్ర, నెక్స్ట్ జనరేషన్ లాంచ్ సిస్టమ్స్, చంద్రుడు, ఇతర గ్రహాల అన్వేషణపై ఇస్రో మరింత దృష్టి పెట్టనుంది.

జాతీయ భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక సామర్థ్యాల అభివృద్ధిపైనా ఫోకస్ చేయనుంది.

భారత్ స్పేస్ విజన్ 2047లో భాగంగా 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

అలాగే 2040 నాటికి భారతీయ వ్యోమగాములను చంద్రుడిపైకి పంపడం, పునర్వినియోగ లాంచ్ వాహనాలను అభివృద్ధి చేయడం, చంద్రుడు, ఇతర గ్రహాలపై దీర్ఘకాలిక పరిశోధనలు చేపట్టడం వంటి లక్ష్యాలు ఉన్నాయి.

ఇలాంటి ప్రతిష్ఠాత్మక మిషన్లకు అత్యాధునిక పరిశోధన, ప్రత్యేక శాస్త్రీయ నైపుణ్యం అవసరమని ఇస్రో తెలిపింది.

టెక్నాలజీలను పరిశ్రమలు విస్తృత స్థాయిలో తయారు చేస్తే.. ఇస్రో తదుపరి తరం టెక్నాలజీలపై మరింత దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుందని వివరించింది.

ప్రైవేట్ రంగంతో కలిసి సామర్థ్యం పెంపు

ఇదే అంశంపై ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ చైర్‌పర్సన్ పవన్ గోయెంకా కూడా స్పందించారు.

ఇస్రో ప్రాధాన్యతను తగ్గించే ఉద్దేశం లేదని, భారత అంతరిక్ష రంగానికి అది పునాదిగానే కొనసాగుతుందని స్పష్టం చేశారు.

2020 నుంచి చేపడుతున్న అంతరిక్ష రంగ సంస్కరణల ప్రధాన లక్ష్యం దేశ అంతరిక్ష వ్యవస్థను విస్తరించడమేనని పవన్ గోయెంకా తెలిపారు.

ప్రైవేట్ పరిశ్రమలు టెక్నాలజీని తయారు చేసి భారీ స్థాయికి తీసుకెళ్లడం ద్వారా మొత్తం అంతరిక్ష రంగ సామర్థ్యం పెరుగుతుందని వివరించారు.

2030 నాటికి ఏడాదికి 50 అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించాలనే లక్ష్యాన్ని సాధించాలంటే ఒకే సంస్థపై ఆధారపడటం సాధ్యం కాదని పవన్ గోయెంకా పేర్కొన్నారు.

ఇందుకోసం ఇస్రో, ప్రైవేట్ రంగాల మధ్య సహకారం అవసరమని చెప్పారు.

ఉద్యోగ సంఘాల ఆందోళనకు ఇస్రో వివరణ

ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన పవన్ గోయెంకా.. భవిష్యత్తులో ఇస్రో స్వయంగా లాంచ్ వాహనాల తయారీ చేయకపోవచ్చని, వాటి తయారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలకు వెళ్లే అవకాశం ఉందని వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి.

దీంతో ఇస్రో ఉద్యోగ సంఘాలు సంస్థ భవిష్యత్ పాత్ర, ఉద్యోగుల పరిస్థితి, కొత్త నియామకాలపై స్పష్టత ఇవ్వాలని కోరాయి.

అయితే ఇస్రో తాజా ప్రకటనతో ఈ ప్రచారంపై స్పష్టత వచ్చింది.

ఇస్రో ప్రైవేటీకరణ కాదని.. అంతరిక్ష రంగ సామర్థ్యాన్ని విస్తరించేందుకు ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచడమే సంస్కరణల ఉద్దేశమని సంస్థ తేల్చి చెప్పింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media