చెరువు ఆక్రమణలపై చర్యలు ఎందుకు లేవని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
ఒవైసీ గ్రూప్‌కు చెందిన మరో కేసులో స్టే ఎత్తివేసిన న్యాయస్థానం
హైదరాబాద్: హైదరాబాద్‌లోని సల్కం చెరువు ఆక్రమణల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెరువు సరిహద్దులు అధికారికంగా నోటిఫై అయినప్పటికీ, ఆక్రమణలపై ఇప్పటివరకు సమర్థవంతమైన చర్యలు తీసుకోకపోవడంపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ కేసులో హైడ్రా, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, నీటిపారుదల శాఖ, విద్యాశాఖ పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
సల్కం చెరువు పరిధిలో బారిస్టర్ ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ నిర్మించినట్లు ఆరోపణలు ఉన్న అక్రమ కట్టడాలపై అధికారులు చర్యలు తీసుకోలేదని సవాలు చేస్తూ ఓ న్యాయవాది దాఖలు చేసిన ప్రజాహిత పిటిషన్‌ను జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ధర్మాసనం విచారించింది.
విచారణ సందర్భంగా ప్రభుత్వం వైఖరిపై న్యాయమూర్తి ప్రశ్నలు సంధించారు. నేషనల్ ట్యాంక్ లెవెల్ సరిహద్దులు గుర్తించిన తర్వాత ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిమితులను ఎలా తగ్గిస్తారని ప్రశ్నించారు.
ఇన్నాళ్లుగా వివాదం కొనసాగుతున్నప్పటికీ, సంబంధిత నిర్మాణాలు చెరువు పరిధిలో ఉన్నాయా లేదా అన్న విషయాన్ని అధికారులు ఎందుకు తేల్చలేకపోయారని నిలదీశారు.
విద్యాసంస్థ తరఫు సీనియర్ కౌన్సిల్ వాదిస్తూ, పిటిషనర్ కేవలం ఒకే సంస్థను లక్ష్యంగా చేసుకుని పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు.
దీనిపై స్పందించిన న్యాయమూర్తి, అక్రమ నిర్మాణాలను ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని స్పష్టం చేశారు. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమేనని వ్యాఖ్యానించారు.
ఈ కేసు తదుపరి విచారణను జులై 30కి వాయిదా వేశారు.
సాలార్-ఎ-మిల్లత్ ట్రస్ట్ కేసులో స్టే రద్దు
ఇదే సమయంలో ఒవైసీ గ్రూప్‌కు చెందిన సాలార్-ఎ-మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌కు సంబంధించిన మరో కేసులో కూడా తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
బండ్లగూడ మండలం కేశవ్‌గిరి కాలనీలో సర్వే నంబర్లు 62/2, 3, 5 పరిధిలోని 2,360 గజాల స్థలంలో నిర్మించిన ఏడు అంతస్తుల భవనాన్ని కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేసింది.
ఈ వ్యవహారంలో గతంలో జులై 6న ఇచ్చిన యథాతథ స్థితి మధ్యంతర ఉత్తర్వులను జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి ఉపసంహరించుకున్నారు.
అదే అంశంపై ఇప్పటికే మరో బెంచ్‌లో విచారణ కొనసాగుతున్నట్లు కోర్టు దృష్టికి రావడంతో, ఒకే విషయంపై రెండు వేర్వేరు బెంచ్‌లలో విచారణలు జరగడం సరికాదని పేర్కొంది.
దీంతో పాత స్టే ఆర్డర్‌ను రద్దు చేస్తూ, ఈ పిటిషన్‌ను ప్రస్తుతం విచారణ జరుగుతున్న బెంచ్‌కు బదిలీ చేయాలని ఆదేశించింది.



