పాతబస్తీ నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు.. మెట్రో రెండో దశలో కీలక అడుగు

August 24, 2026 11:33 AM
Hyderabad Metro Phase 2 expansion plans across key corridors

నాణ్యతకు 70 మార్కులు.. ధర, సామర్థ్యానికీ ప్రాధాన్యం
కేంద్రం డీపీఆర్ ఆమోదం కోసం రాష్ట్రం ప్రయత్నాలు

హైదరాబాద్: Hyderabad Metro Phase రెండో దశ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) చర్యలు ముమ్మరం చేసింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఐటీ కారిడార్లు, పాతబస్తీ వరకు మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

రూ.38,595 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులో కీలకమైన జనరల్ కన్సల్టెంట్ల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది.

ఇటీవల నిర్వహించిన ప్రీ-బిడ్ సమావేశానికి 12 సంస్థలు హాజరయ్యాయి. మెట్రో రెండో దశలో మొత్తం 7 కారిడార్లను ప్రతిపాదించారు. వీటి మొత్తం పొడవు సుమారు 122.9 కిలోమీటర్లు.

తొలి విడతలో నాలుగు మార్గాలకు జనరల్ కన్సల్టెంట్లను నియమించాలని HMRL నిర్ణయించింది. ఇందులో నాగోల్–శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, రాయదుర్గ్–కోకాపేట, MGBS–చాంద్రాయణగుట్ట, ఎల్బీనగర్–హయత్‌నగర్ కారిడార్లు ఉన్నాయి.

నాగోల్–శంషాబాద్ మార్గం 36.8 కిలోమీటర్లు, రాయదుర్గ్–కోకాపేట 11.6 కిలోమీటర్లు, MGBS–చాంద్రాయణగుట్ట 7.5 కిలోమీటర్లు, ఎల్బీనగర్–హయత్‌నగర్ 7.1 కిలోమీటర్ల మేర ఉండనున్నాయి.

క్వాలిటీకి 70 మార్కులు:

జనరల్ కన్సల్టెంట్ల ఎంపికలో క్వాలిటీ కమ్ కాస్ట్ బేస్డ్ సెలెక్షన్ విధానాన్ని అనుసరించనున్నారు. సంస్థలను మొత్తం 100 మార్కులతో అంచనా వేస్తారు.

గతంలో చేపట్టిన ప్రాజెక్టుల నాణ్యత, నిర్మాణంలో ఉపయోగించిన ముడి పదార్థాలు, పనులు పూర్తి చేసిన సమయం, వారంటీ వంటి అంశాలకు 70 మార్కులు కేటాయించారు.

సంస్థలు సమర్పించే సీవీలు, నిపుణుల అర్హతలకు మరో 30 మార్కులు ఉంటాయి. గతంలో సంస్థలు చేపట్టిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించే అవకాశం కూడా ఉంది.

నాణ్యత, సామర్థ్యం, టెండర్ ధర వంటి అంశాలను పరిశీలించిన తర్వాత తుది ఎంపిక చేస్తారు.

డీపీఆర్‌పై కేంద్రం నిర్ణయం కీలకం:

మెట్రో రెండో దశ డీపీఆర్‌కు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

కేంద్రం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు HMRL ఏర్పాట్లు చేస్తోంది.

ఇదే సమయంలో L&T నుంచి మొదటి దశ మెట్రో ప్రాజెక్టును స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన రుణాల సమీకరణపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం SBI Capsను కన్సల్టెన్సీగా నియమించింది.

దేశ, విదేశాల్లోని బ్యాంకులతో చర్చలు జరిపి రుణం సమీకరించే బాధ్యతను SBI Capsకు అప్పగించింది. రుణాలపై వడ్డీ రేటు 3 నుంచి 4 శాతం లోపు ఉండేలా చూడాలని ప్రభుత్వం సూచించింది.

ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

20 ఏళ్లలో రుణాల చెల్లింపు:

సమీకరించే రుణాలను సుమారు 20 ఏళ్లలో తిరిగి చెల్లించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

నిర్ణీత సమయంలో కిస్తీలు చెల్లించకపోతే రాష్ట్రానికి వచ్చే రుణాల్లో నుంచి బ్యాంకులు తమ బకాయిలను సర్దుబాటు చేసుకునే అవకాశం ఉండేలా నిబంధనలు రూపొందించనున్నారు.

మొత్తంగా.. ఒకవైపు మెట్రో రెండో దశలోని నాలుగు కీలక కారిడార్లకు కన్సల్టెంట్ల ఎంపికను వేగవంతం చేస్తూ, మరోవైపు మొదటి దశ మెట్రో టేకోవర్‌కు అవసరమైన రుణాల సమీకరణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media