దట్టమైన పొగ పీల్చి ముగ్గురు చిన్నారులు మృతి.. మరో ఆరుగురి పరిస్థితి విషమం
అమరావతిలో తెల్లవారుజామునే ప్రమాదం
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా ప్రభుత్వ మహిళా ఆసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఉదయం 3.30 గంటల ప్రాంతంలో ఆసుపత్రి మూడో అంతస్తులోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం (SNCC)లో వెంటిలేటర్ ఒక్కసారిగా పేలింది.
దీంతో వెంటనే మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన పొగ వార్డులో అలుముకుంది.
ప్రమాద సమయంలో ఆ విభాగంలో మొత్తం 39 మంది నవజాత శిశువులు చికిత్స పొందుతున్నారు.
మంటలు వ్యాపించడాన్ని గుర్తించిన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది వెంటనే స్పందించారు.
పసిపాపలకు అమర్చిన వైద్య పరికరాలను తొలగించి వారిని ప్రమాద స్థలం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ముగ్గురు చిన్నారులు మృతి
అయితే ప్రమాదం కారణంగా వార్డులో దట్టమైన పొగ వ్యాపించింది.
ఈ పొగను పీల్చుకోవడంతో ముగ్గురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం సమీపంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి అత్యవసరంగా తరలించారు.
మిగిలిన 30 మందిని ఆసుపత్రి సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP)తో పాటు ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకున్నారు.
పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి దారితీసిన పరిపాలనాపరమైన లోపాలపై పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు స్థానిక యంత్రాంగం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఈ ఘటనపై అమరావతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి చంద్రశేఖర్ బావన్కులే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రాణాలు కోల్పోయిన పసిపాపల కుటుంబాలకు ఆయన గాఢ సానుభూతి తెలిపారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. ఈ తీరని లోటును తట్టుకునే శక్తిని తల్లిదండ్రులకు ఆ దేవుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.



