పాక్‌కు 8 భారతీయ సిమ్ కార్డులు?
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) గూఢచర్య నెట్‌వర్క్‌ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఛేదించింది.
ఈ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై ఢిల్లీకి చెందిన సాహిల్ (25), అతని భార్య సమీరా (21)ను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2024లో ఇన్స్టాగ్రామ్ ద్వారా సాహిల్‌కు పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం క్రమంగా గూఢచర్య కార్యకలాపాల వైపు వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. సాహిల్, సమీరా పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరుపుతూ భారతదేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చేరవేసేందుకు సహకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
2024-25 మధ్య ఈ దంపతులు ఎనిమిది భారతీయ సిమ్ కార్డులను సేకరించి, వాటిని దుబాయ్ మీదుగా పాకిస్థాన్‌కు పంపినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఇందుకు వారికి సుమారు రూ.30 వేల వరకు నగదు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆ సిమ్ కార్డులతో పాకిస్థాన్‌లో వాట్సాప్ ఖాతాలను యాక్టివేట్ చేసి, భారతీయులను సంప్రదించేందుకు ఉపయోగించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.
కొన్ని ఖాతాల ద్వారా భారతీయ వాట్సాప్ గ్రూపుల్లోకి ప్రవేశించి సమాచారం సేకరించేందుకు కూడా ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు.
సైనిక ప్రాంతాలపై రెక్కీ.. కీలక సమాచారం సేకరణ?
సాహిల్‌కు భారతదేశంలోని వివిధ కంటోన్మెంట్ ప్రాంతాలను పరిశీలించడం, గూఢచర్య కార్యకలాపాలకు అవసరమైన సమాచారాన్ని సేకరించడం, ఇతర వ్యక్తులను నెట్‌వర్క్‌లోకి తీసుకురావడం వంటి బాధ్యతలు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు.
కోర్ట్ మార్షల్ ఎదుర్కొంటున్న సైనిక సిబ్బందికి సంబంధించిన సమాచారాన్ని కూడా సాహిల్ అందించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
సాహిల్‌ను ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ ప్రాంతంలో తొలుత అరెస్టు చేశారు. అనంతరం అతని మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్‌గా పరిశీలించగా.. పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్లతో జరిగిన సంభాషణలు లభించినట్లు పోలీసులు చెప్పారు.
ఆ ఆధారాల ఆధారంగా సమీరా పాత్రను గుర్తించి ఆమెను కూడా అరెస్టు చేశారు.
డిజిటల్ ఆధారాలపై దర్యాప్తు
నిందితుల నుంచి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిలోని డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నారు.
ఈ నెట్‌వర్క్‌తో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి? ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి? మరెవరైనా ఇందులో భాగస్వాములయ్యారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.



