ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. తెలంగాణ వ్యక్తి మృతి

September 2, 2026 11:28 AM

ఉపాధి కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన సుదర్శన్ గౌడ్

ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.

ఉపాధి కోసం ఉక్రెయిన్‌కు వెళ్లిన తెలంగాణ వ్యక్తి రష్యా జరిపిన క్షిపణి దాడిలో మృతి చెందారు.

జగిత్యాల జిల్లా హసనాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ (42) ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు.

కీవ్‌పై భారీ దాడులు

మంగళవారం కీవ్‌తో పాటు ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై రష్యా బలగాలు క్షిపణులు, డ్రోన్లతో భారీ దాడులు చేశాయి.

ఈ ఘటనలో మొత్తం 12 మంది మృతి చెందినట్లు నివేదికలు వెల్లడించాయి.

గది నుంచి బయటకు వచ్చిన సమయంలో దాడి

ఉక్రెయిన్‌కు వెళ్లే ముందు సుదర్శన్ గౌడ్ తన స్వగ్రామంలో షట్టరింగ్ పనులు చేసుకుంటూ జీవించేవారు.

కుటుంబాన్ని పోషించేందుకు ఉపాధి కోసం సుమారు నాలుగు నెలల క్రితం ఉక్రెయిన్‌కు వెళ్లారు.

మంగళవారం కీవ్ నగరంపై రష్యా బలగాలు క్రిజ్ మిస్సైళ్లు, డ్రోన్లతో దాడి చేస్తున్న సమయంలో సుదర్శన్ తాను ఉంటున్న గది నుంచి బయటకు వచ్చారు.

అదే సమయంలో జరిగిన పేలుళ్ల ధాటికి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.

కుటుంబంలో విషాదం

ఉక్రెయిన్‌లోనే ఉంటున్న తాటిపల్లి గ్రామానికి చెందిన వేణు ద్వారా సుదర్శన్ మృతి చెందిన విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. గది నుంచి బయటకు వచ్చిన సమయంలో జరిగిన దాడిలో సుదర్శన్ మృతి చెందినట్లు కుటుంబానికి సమాచారం అందింది.

విదేశాలకు ఉపాధి కోసం వెళ్లి అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడంతో సుదర్శన్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వాలు స్పందించి సుదర్శన్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media