టార్నెట్లో రాత్రివేళ రోడ్డుపై దీపం పెట్టిన మహిళ
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఓ భారతీయ మహిళ చేసిన పని స్థానికంగా చర్చకు దారితీసింది.
టార్నెట్లోని నోక్స్లీ అవెన్యూలో నివసించే ఓ మహిళ ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చారు.
చేతిలో దీపం పట్టుకుని రోడ్డుపై కొంత దూరం నడిచారు. అనంతరం రోడ్డు చివర దీపాన్ని నేలపై పెట్టారు.
చెప్పులు తీసేసి అక్కడే దణ్ణం పెట్టుకున్నారు.
ఆమె వెంట మరో వ్యక్తి కూడా ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరూ వెనక్కి తిరిగి చూడకుండా వేగంగా ఇంటికి వెళ్లిపోయారు.
మహిళ రోడ్డుపై దీపం పెడుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
వీడియోతో స్థానికంగా చర్చ
ఈ ఘటనను గమనించిన గుర్జీత్ అనే నివాసి స్థానిక వార్తా సంస్థ ‘విండ్హామ్ టీవీ’కి సమాచారం ఇచ్చారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
స్థానిక భారత కమ్యూనిటీలోనూ ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఆ మహిళ చేసిన పని మూఢనమ్మకానికి సంబంధించినదై ఉండొచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేశారు.
మరికొందరు అది కుటుంబ ఆచారం కావచ్చని అభిప్రాయపడ్డారు.
విదేశాల్లో ఇలాంటి ఘటనలు జరగడం వల్ల భారతీయ సమాజంపై ప్రతికూల అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
క్షుద్రపూజ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం
వీధిలో దీపం పెట్టడం ఏ భారతీయ సంప్రదాయంలోనూ లేదంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
మరికొందరు ఆ ఘటనను క్షుద్రపూజతో ముడిపెడుతూ అనుమానాలు వ్యక్తం చేశారు.
అయితే ఆ ఇంట్లో క్షుద్రపూజ జరిగిందని చెప్పడానికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు.
ఒకవేళ అలాంటి విషయం అధికారుల దృష్టికి వెళ్తే భారత కమ్యూనిటీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కొందరు వ్యాఖ్యానించారు.
వాహనాలు వెళ్లే రోడ్డుపై దీపం ఎందుకు పెట్టారని మరికొందరు నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు.
అసలు కారణం ఏంటి?
అయితే మహిళ రోడ్డుపై అకస్మాత్తుగా దీపం ఎందుకు పెట్టారనే విషయం ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు.
అది చేతబడికి సంబంధించినదని నిరూపించే అధికారిక ఆధారాలు కూడా లేవు.
అయితే రోడ్డు భద్రతపై మాత్రం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రివేళ వాహనాలు, పాదచారులు వెళ్లే రోడ్డుపై ఇలాంటి వస్తువులు ఉంచడం ప్రమాదకరంగా మారొచ్చని చెబుతున్నారు.
ఈ ఘటనపై అధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.



