నేపాల్ వరదల్లో మహిళా ‘పైలట్’ సాహసం.. ఆరు రోజుల్లో 100 రెస్క్యూ ఆపరేషన్లు

September 2, 2026 2:52 PM

భారీ వరదల్లో ప్రాణాలకు తెగించి సహాయక చర్యలు
  • రసువా జిల్లాలోని తైమూర్ పట్టణంలో దాదాపు 20 హెలికాప్టర్లు రాత్రింబవళ్లు రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి.
  • నేపాల్ తొలి మహిళా హెలికాప్టర్ పైలట్ ప్రియా అధికారి నాయకత్వంలో ఆరు రోజుల్లో దాదాపు 100 రెస్క్యూ ఆపరేషన్లు జరిగాయి.
  • తొలి రెండు రోజుల్లోనే 200 మందిని రక్షించినట్లు ప్రియా అధికారి తెలిపారు.
పర్యావరణ శాస్త్ర విద్యార్థి నుంచి పైలట్‌గా..

సాధారణ పర్యావరణ శాస్త్ర విద్యార్థిగా తన జీవితాన్ని ప్రారంభించిన ప్రియా అధికారి అనుకోని మలుపుతో హెలికాప్టర్ పైలట్‌గా మారారు.

క్యాబిన్ సిబ్బందిగా పనిచేస్తున్న సమయంలో హెలికాప్టర్‌లో చేసిన విహారయాత్ర ఆమె ఆలోచనలను మార్చింది.

ఆ తర్వాత కేవలం నాలుగు నెలల్లోనే ఫిలిప్పీన్స్‌కు వెళ్లి కఠినమైన హెలికాప్టర్ పైలట్ శిక్షణ పూర్తి చేసుకున్నారు.

అనంతరం నేపాల్‌లో తొలి మహిళా హెలికాప్టర్ పైలట్‌గా గుర్తింపు పొందారు.

2017 నుంచి పూర్తిస్థాయి పైలట్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రియా అధికారి.. ఎత్తైన హిమాలయ ప్రాంతాల్లో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించడంలో నైపుణ్యం సంపాదించారు.

ఎవరెస్ట్ పర్వత ప్రాంతాల్లో గాయపడిన పర్వతారోహకులను రక్షించి ఎంతో మంది ప్రాణాలను కాపాడారు.

సముద్ర మట్టానికి సుమారు 6200 మీటర్ల ఎత్తులో జరిగిన క్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్లలోనూ ఆమె పాల్గొన్నారు.

ప్రమాదకర పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకుండా..

ప్రస్తుతం నేపాల్‌ను కుదిపేసిన ఆకస్మిక వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.

వరద నీటిలో వందలాది మంది కొట్టుకుపోగా.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో హెలికాప్టర్ల ద్వారా ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.

వరద ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న రసువా జిల్లాలోని తైమూర్ పట్టణంలో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు దాదాపు 20 హెలికాప్టర్లు పనిచేస్తున్నాయి.

భారీ బురద ఉన్న ప్రాంతాల్లో హెలికాప్టర్లు దించడం కష్టంగా మారుతోంది.

దీంతో పైలట్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

‘‘ఇది ఎన్నడూ కనీవినీ ఎరుగని విలయం’’

తన రెస్క్యూ అనుభవాలను ఓ అంతర్జాతీయ వార్తా ఛానెల్‌తో ప్రియా అధికారి పంచుకున్నారు.

‘‘ఒక్కోసారి ఐదారు హెలికాప్టర్లు ఒకే ప్రాంతంలో దిగుతున్నాయి.

బాధితులను తరలించడానికి రేడియో ద్వారా ఒకరితో ఒకరం సమాచారం పంచుకుంటూ సమన్వయం చేసుకుంటున్నాం.

భారీగా బురద ఉన్న ప్రాంతంలో చాపర్లు దిగడం కష్టంగా ఉంటుంది.

దీంతో ప్రమాదకర పరిస్థితుల్లో బాధితులను తరలిస్తున్నాం.

ఆపరేషన్ కొనసాగుతున్నంత సేపు పైలట్లు చాలా అలర్ట్‌గా ఉండాల్సి వస్తుంది.

తొలి రెండు రోజుల్లోనే 200 మందిని కాపాడాం.

వరదలో ఎన్నో మృతదేహాలు చిక్కుకోవడాన్ని కళ్లారా చూశాం.

దాదాపు ఐదు జలవిద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. ఎన్నడూ కనీవినీ ఎరుగని విలయం ఇది.

ప్రాణనష్టం భారీగా చోటుచేసుకుంది’’ అని ప్రియా అధికారి ఆవేదన వ్యక్తం చేశారు.

వరుస ప్రయాణాల వల్ల పైలట్లు తీవ్రంగా అలసిపోయినప్పటికీ.. రెస్క్యూ పనులను మాత్రం ఆపకుండా కొనసాగిస్తున్నామని ప్రియా అధికారి అంతర్జాతీయ మీడియాతో తెలిపారు.

ప్రమాదకర పరిస్థితుల్లో ఆపరేషన్లు చేపట్టేందుకు ప్రత్యేక శిక్షణ పొందానని.. ప్రాణాలను రక్షించడమే తన ప్రధాన కర్తవ్యమని ఆమె చెబుతున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media