అజిత్ పవార్ మరణంపై రాజకీయ విమర్శలు వద్దు
మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణాన్ని రాజకీయం చేయొద్దని ఆయన భార్య, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సునేత్రా పవార్ విజ్ఞప్తి చేశారు.
అజిత్ దాదా మరణంతో మహారాష్ట్రలో ఏర్పడిన శూన్యతను ఆయన పిల్లలు, తన కంటే బాగా ఎవరూ అర్థం చేసుకోలేరని ఆమె అన్నారు.
సుప్రియా సూలే వ్యాఖ్యలకు ఘాటు స్పందన
శరద్ పవార్ కుమార్తె, అజిత్ పవార్ సోదరి సుప్రియా సూలే ఇటీవల చేసిన వ్యాఖ్యలకు సునేత్రా పవార్ కౌంటర్ ఇచ్చారు.
అజిత్ పవార్ మరణం తర్వాత ఆయన వర్గానికి చెందిన ఎన్సీపీ నేతలు శోకంలో ఉండకుండా ‘అధికారాన్ని అనుభవిస్తున్నారని’ సుప్రియా సూలే ఆరోపించారు.
అజిత్ పవార్ మరణంపై ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ (FIR) ఎందుకు నమోదు చేయలేదని ఆమె ప్రశ్నించారు.
తమ కుటుంబం ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయిందని, అయితే అజిత్ వర్గానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు లేదా 8-9 మంది మంత్రుల్లో ఒక్కరైనా ఆయన మరణంపై ఎఫ్ఐఆర్ లేదా సరైన విచారణ కోసం మాట్లాడారా అని సుప్రియా సూలే ప్రశ్నించారు.
దీనిపై సునేత్రా పవార్ స్పందిస్తూ.. ఈ విషాద ఘటనను రాజకీయంగా చూడొద్దని కోరారు. ‘‘అజిత్ దాదా మరణంతో మహారాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన శూన్యత ఎలాంటిదో ఆయన పిల్లలు, నా కంటే బాగా ఎవరు అర్థం చేసుకోగలరు?.. అందుకే ఈ విచారకరమైన ఘటనను దయచేసి రాజకీయం చేయకండి’’ అని ఆమె అన్నారు.
విచారణపై కుటుంబానికి నమ్మకం ఉందన్న సునేత్రా
ఈ ఏడాది జనవరి 28న బారామతి విమానాశ్రయం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
రన్‌వేకు కొద్దిదూరంలో ల్యాండింగ్ సమయంలో విమానం కూలిపోయింది.
ఈ ఘటన వెనుక కుట్ర ఉందా? అనే కోణంలో విచారణ జరపాలని అజిత్ పవార్ కుటుంబసభ్యులు కోరారు.
సునేత్రా పవార్ కూడా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
‘‘ఈ విషాదం తర్వాత ప్రతి ఒక్కరూ స్పష్టమైన నిర్ణయం కోరుకుంటున్నారు.. ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని సునేత్రా పవార్ తెలిపారు.
‘‘మేము ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిశాం.. ఈ విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శాసనసభలో మాట ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు’’ అని ఆమె చెప్పారు.
దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేస్తున్నాయని, వాటిపై, చట్టంపై, రాజ్యాంగంపై తనకు పూర్తి నమ్మకం ఉందని సునేత్రా పవార్ అన్నారు. విచారణాధికారులకు తగిన సమయం ఇవ్వాలని ఆమె కోరారు.
విచారణకు సంబంధించిన అప్డేట్లు ఇవ్వడం అంటే పదే పదే మీడియా ముందుకు రావడం కాదని సునేత్రా పవార్ వ్యాఖ్యానించారు.
‘‘ఇక్కడ పదే పదే మీడియా ట్రయల్ జరుగుతోందా? అనే అనుమానం కలుగుతోంది. అజిత్ దాదా తల్లి, ఆయన పిల్లలు, నా కంటే ఎక్కువ బాధపడేవారు ఎవరైనా ఉంటారా? అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కుట్ర ఆరోపణలు.. దర్యాప్తు సంస్థలపై చర్చ
మరోవైపు, ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే, శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్ కూడా అజిత్ పవార్ మరణం ఒక కుట్ర అని ఆరోపించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అజిత్ కుమారుడు జై పవార్ కూడా ప్రమాదంపై సందేహాలు వ్యక్తం చేశారు. మరోవైపు, ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) నివేదిక వచ్చే వరకు సీబీఐ నేరుగా రంగంలోకి దిగలేదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర సీఐడీ కూడా దీనిపై సమాంతరంగా విచారణ జరుపుతోంది.
ఏఏఐబీ ప్రాథమిక నివేదిక ప్రకారం.. నిర్దేశిత పరిమితుల కంటే తక్కువగా ఉన్న విజిబిలిటీ, భద్రతా లోపాలే ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు.
విజువల్ ఫ్లైట్ రూల్స్ (VFR) ప్రకారం ల్యాండింగ్‌కు కనీసం 5 కిలోమీటర్ల విజిబిలిటీ అవసరం.
అయితే ప్రమాద సమయంలో ల్యాండింగ్ దృశ్యమానత కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే ఉంది.
వీఎస్ఆర్ వెంచర్స్‌కు చెందిన ‘లియర్‌జెట్ 45ఎక్స్ఆర్’ విమానం రన్‌వే 11పై ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగింది.
ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న అజిత్ పవార్ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.



