మ్యాట్రిమోనీలో సంబంధాలు చూస్తున్న పేరెంట్స్‌కు బిగ్ అలర్ట్.. ఇలా చేస్తే మోసపోవడం ఖాయం!

September 7, 2026 11:22 AM

మ్యాట్రిమోనీ పేరుతో కొత్త తరహా మోసాలు

తమ పిల్లలకు మంచి సంబంధం కుదిర్చి పెళ్లి చేయాలనేది ప్రతి తల్లిదండ్రుల ఆశ. మంచి సంబంధం కోసం బంధువులు, తెలిసినవారితో పాటు ఇప్పుడు మ్యాట్రిమోనీ సంస్థలను కూడా ఆశ్రయిస్తున్నారు.

అయితే ఇదే పరిస్థితిని కొందరు సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

మ్యాట్రిమోనీ సంస్థల పేరుతో ఫోన్ కాల్స్ చేస్తున్నారు. ఆకర్షణీయమైన ప్రొఫైల్స్ పంపిస్తున్నారు.

నమ్మించే మాటలు చెప్పి తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి మాయం అవుతున్నారు.

తాజాగా ఇలాంటి ఘటన నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది.

ముందుగా ఫోన్.. ఆ తర్వాత అబ్బాయి ప్రొఫైల్

“మీ అమ్మాయికి పెళ్లి సంబంధం చూస్తున్నారా? మా మ్యాట్రిమోనీ సంస్థలో మీ అమ్మాయికి తగిన సంబంధాలు ఉన్నాయి. అబ్బాయి ప్రొఫైల్ పంపిస్తాం” అంటూ కేటుగాళ్లు ఫోన్ చేస్తున్నారు.

తల్లిదండ్రులు ఆసక్తి చూపగానే వెంటనే వాట్సాప్‌లో అబ్బాయి ఫొటో, ప్రొఫైల్ పంపిస్తున్నారు.

ఎన్‌ఆర్‌ఐ, డాక్టర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, భారీ జీతం, కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని చెప్పి ప్రొఫైల్‌ను నమ్మేలా చేస్తున్నారు.

అబ్బాయి నచ్చాడని తల్లిదండ్రులు చెప్పగానే అసలు మోసం మొదలవుతోంది.

“రూ.5 వేలు కట్టండి.. నంబర్ ఇస్తాం”

“మీ పేరు రిజిస్టర్ చేయాలంటే రూ.5 వేలు పంపండి. అబ్బాయి తల్లిదండ్రుల ఫోన్ నంబర్ ఇస్తాం.

మరికొన్ని మంచి ప్రొఫైల్స్ కూడా పంపిస్తాం” అంటూ డబ్బులు అడుగుతున్నారు.

పెళ్లి సంబంధం కుదిరే ఆశతో తల్లిదండ్రులు డబ్బులు పంపుతున్నారు. డబ్బులు అందిన కొద్దిసేపటికే అబ్బాయి తల్లిదండ్రుల పేరుతో ఓ ఫోన్ నంబర్ ఇస్తున్నారు.

కానీ ఆ నంబర్‌కు కాల్ చేస్తే “ఈ నంబర్ ప్రస్తుతం పనిచేయడం లేదు” అనే సమాధానం వస్తోంది.

మ్యాట్రిమోనీకి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తోంది. వాట్సాప్‌లో పంపిన ప్రొఫైల్ కనిపించదు. ఫోన్ చేసిన వ్యక్తి కూడా అందుబాటులో ఉండడు. డబ్బులు మాత్రం తిరిగి రావు.

అడ్వాన్స్ పేరుతో మరో దందా

మరో విధానంలోనూ ఈ మోసాలు జరుగుతున్నాయి. ముందుగా పేరున్న మ్యాట్రిమోనీ సంస్థల్లో కొంత మొత్తాన్ని చెల్లించి అక్కడి ప్రొఫైల్స్‌ను పరిశీలిస్తున్నారు.

ఆ తర్వాత తమకు అనుకూలంగా ఉన్న ప్రొఫైల్స్‌ను గుర్తించి ఆయా కుటుంబాలను టార్గెట్ చేస్తున్నారు.

ఎక్కువ కాలంగా సంబంధం కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు, వయసు దాటిపోతున్న యువతీ యువకులు, రెండో పెళ్లి కోసం చూస్తున్నవారిని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

తామే మ్యాట్రిమోనీ నిర్వాహకులమని పరిచయం చేసుకుని “మీకు మంచి సంబంధం కుదురుస్తాం” అంటూ రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు అడ్వాన్స్ తీసుకుంటున్నారు. డబ్బులు అందిన తర్వాత ఫోన్ ఎత్తడం లేదు.

ఒకవేళ ఫోన్ ఎత్తినా “సంబంధం మాట్లాడుతున్నాం.. కొంత సమయం పడుతుంది” అంటూ కాలయాపన చేస్తున్నారు. చివరకు పూర్తిగా అందుబాటులో లేకుండా పోతున్నారు.

చిన్న మొత్తమే.. కానీ పెద్ద వల

మ్యాట్రిమోనీ సంస్థల పేరుతో మోసగాళ్లు పక్కా ప్లాన్‌తో బాధితులను టార్గెట్ చేస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.5 వేలు, రూ.10 వేలు మాత్రమే తీసుకుంటున్నారు.

మొత్తం తక్కువగా ఉండటంతో చాలామంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఆసక్తి చూపడం లేదు.

కానీ ఇలాంటి వ్యక్తులు పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో కుటుంబాలను టార్గెట్ చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసే అవకాశం ఉంది.

నానాటికీ పెరుగుతున్న బాధితుల సంఖ్య?

ఈ తరహా మ్యాట్రిమోనీ కాల్స్ ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాల నుంచి వస్తున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు.

చిన్న మొత్తాల్లోనే మోసం చేస్తుండటంతో చాలామంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు.

దీంతో బయటకు కనిపిస్తున్న కేసుల కంటే వాస్తవంగా మోసపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇలాంటి మోసాలపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

మ్యాట్రిమోనీ కాల్ వస్తే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

మ్యాట్రిమోనీ పేరుతో ఫోన్ వస్తే వెంటనే నమ్మొద్దని పోలీసులు, సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

సంస్థకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలని చెబుతున్నారు.

కార్యాలయ చిరునామా, సంప్రదింపు వివరాలను పరిశీలించాలి. గుర్తింపు లేని వ్యక్తిగత నంబర్లకు డబ్బులు పంపకూడదు.

అబ్బాయి, అతని కుటుంబ సభ్యుల వివరాలను స్వతంత్రంగా తెలుసుకోవాలి. ఫొటోలు, ఉద్యోగం, ఆస్తుల వివరాలను మాత్రమే ఆధారంగా చేసుకుని నమ్మకూడదు.

తొందరపెట్టి డబ్బులు అడిగితే మరింత అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ మోసం జరిగితే చెల్లింపు వివరాలు, ఫోన్ నంబర్లు, వాట్సాప్ చాట్స్, ప్రొఫైల్ ఫొటోలను భద్రపరచి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media