తెలంగాణ రాష్ట్ర పోలీస్ చరిత్రలో ఒక కీలక మైలురాయి నమోదైంది. నిషేధిత సిపిఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన 41 మంది అజ్ఞాత కేడర్లు నేడు (19.12.2025) రాష్ట్ర డీజీపీ సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. దశాబ్దాల పాటు అజ్ఞాతంలో గడిపిన వీరు, భారీగా ఆయుధాలతో సహా లొంగిపోవడం మావోయిస్టు రహిత సమాజం దిశగా ఒక పెద్ద అడుగుగా భావించవచ్చు.

లొంగిపోయిన వారిలో 6 గురు కీలక కమిటీ సభ్యులు (CyPCMs/DVCMs) ఉన్నారు. వీరి నుంచి ఒక LMG, 3 AK-47లు, 5 SLRలు, 7 ఇన్సాస్ రైఫిళ్లు సహా మొత్తం 24 అధునాతన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్టోబర్ 21న ముఖ్యమంత్రి A.రేవంత్ రెడ్డి ఇచ్చిన “అజ్ఞాతాన్ని వీడండి – అభివృద్ధిలో భాగస్వాములు కావండి” అనే పిలుపునకు ప్రభావితమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాజీ మావోయిస్టులు తెలిపారు.

నాయకత్వంపై అపనమ్మకం, సిద్ధాంతాలకు ఆచరణకు మధ్య దూరం, అటవీ ప్రాంతాల్లో ఎదురవుతున్న కఠిన పరిస్థితులు మరియు పోలీసుల నిరంతర ఒత్తిడి కారణంగానే పార్టీని వీడుతున్నట్లు వారు వెల్లడించారు.


లొంగిపోయిన 41 మందికి ప్రభుత్వం తరఫున మొత్తం రూ. 1,46,30,000/- (ఒక కోటి 46 లక్షల 30 వేల రూపాయలు) నగదు బహుమతి (రివార్డు) ప్రకటించారు. తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి రూ. 25,000/- అందజేశారు.
“పోరు వద్దు.. ఊరు ముద్దు” అని పేర్కొంటూ, అజ్ఞాతంలో ఉన్న మిగిలిన 54 మంది కూడా హింసను వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ కోరారు
