వరంగల్ జిల్లా పైడిపల్లిలో దారి మైసమ్మ ఆలయం కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ముందస్తు నోటీసులు లేకుండానే అధికారులు ఆలయాన్ని తొలగించారన్న ఆగ్రహంతో స్థానిక ప్రజలు, బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఆలయ నిర్మాణానికి భూమి, నిధులు సమకూర్చిన దాత బొల్లం రవి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశారు.

ఈ ఘటనతో పైడిపల్లిలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఆలయ కూల్చివేతను నిరసిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఆధ్వర్యంలో ఇస్కాన్ టెంపుల్ వద్ద ములుగు జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కేవలం హిందూ దేవాలయాలనే లక్ష్యంగా చేసుకుంటోందని బీజేపీ నేతలు విమర్శించారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి వేళల్లో ఆలయాలను కూల్చడం ఎంతవరకు ధర్మమని ప్రశ్నించారు.

దారి మైసమ్మను ఊరి ఆత్మగా, ప్రయాణికులను కాపాడే శక్తిగా భావించే ఆచారం తెలంగాణలో వేల ఏళ్లుగా ఉంది. అటువంటి నమ్మకాన్ని అధికారులు తుంగలో తొక్కి ధార్మిక భావాలను దెబ్బతీశారని స్థానికులు విలపిస్తున్నారు. కూల్చిన చోటే ఆలయాన్ని ప్రభుత్వం వెంటనే పునర్నిర్మించాలని, విధి నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.
