ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు కోట్లాది రూపాయల టోకరా వేసిన భారీ కుంభకోణం నిజామాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. శాంతిభద్రతలను కాపాడాల్సిన రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఈ మోసాలకు సూత్రధారిగా వ్యవహరించడం సంచలనం రేపుతోంది. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కుబీర్ రెడ్డి, ఆదిలాబాద్‌కు చెందిన స్వరూప అనే మహిళతో కలిసి ఈ దందాకు తెరలేపారు. స్వరూపను ‘ఆర్టీఓ ఉన్నతాధికారిణి’గా పరిచయం చేసి నిరుద్యోగులకు వల వేసేవారు.

ఏకంగా జిల్లా కలెక్టర్ సంతకాలతో కూడిన నకిలీ ఆర్డర్ కాపీలను సృష్టించి బాధితులకు అందజేయడం వీరి బరితెగింపునకు నిదర్శనం. ఉద్యోగం రాక, డబ్బులు తిరిగి అడిగిన బాధితులను కుబీర్ రెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు గురిచేసేవాడు.

గతంలో ఒక నీటిపారుదల శాఖ ఉద్యోగిని బెదిరించి రూ. 35 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు నిజామాబాద్ త్రీ-టౌన్ పోలీసులు కుబీర్ రెడ్డి, స్వరూపలపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం స్వరూప పరారీలో ఉండగా, పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
