ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో తాము ఎప్పుడూ ముందుంటామని బాన్సువాడ పోలీసులు మరోసారి నిరూపించుకున్నారు. రోడ్డు పక్కన అనాథగా పడి ఉన్న ఓ వృద్ధురాలి పట్ల ఇద్దరు కానిస్టేబుళ్లు చూపిన చొరవ స్థానికుల మనసు గెలుచుకుంది.
బాన్సువాడ పట్టణంలోని రోడ్డు డివైడర్‌పై ఓ వృద్ధురాలు దీనస్థితిలో పడుకొని కాలం వెళ్లదీస్తోంది. చాలామంది ఆమెను చూసి వెళ్ళిపోతున్నా, విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ సుభాష్ మరియు అతని మిత్రుడు (మరో కానిస్టేబుల్) ఆమె పరిస్థితిని చూసి చలించిపోయారు.
ఆ వృద్ధురాలిని అక్కున చేర్చుకున్న కానిస్టేబుళ్లు స్వయంగా ఆమెకు స్నానం చేయించి, కొత్త బట్టలు కొనిచ్చారు. అనంతరం ఆకలితో ఉన్న ఆమెకు కడుపునిండా భోజనం పెట్టి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.
పోలీసులు చేసిన ఈ ఉదాత్తమైన పనిని చూసి పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు సైతం కానిస్టేబుల్ సుభాష్ మరియు అతని మిత్రుడిని ప్రత్యేకంగా అభినందించారు.
