కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో రాజకీయ వర్గాల మధ్య జరిగిన గొడవ తీవ్ర హింసకు దారితీసింది. గంగావతి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి నివాసం వద్ద జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ సందర్భంగా బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరులు, గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద బ్యానర్లు కట్టేందుకు ప్రయత్నించారు. దీన్ని జనార్దన్ రెడ్డి వర్గీయులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది.మాట మాట పెరిగి పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో భరత్ రెడ్డి మద్దతుదారుడు, కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ (28) అక్కడికక్కడే మృతి చెందాడు. గంగావతి నుంచి ఇంటికి తిరిగి వస్తున్న తనపై భరత్ రెడ్డి అనుచరులు 4-5 రౌండ్లు కాల్పులు జరిపారని, ఇది ముందస్తుగా పన్నిన హత్యాయత్నం అని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. దొరికిన బుల్లెట్ కేసింగ్‌లను ఆయన మీడియాకు ప్రదర్శించారు. ఘటన అనంతరం పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ప్రస్తుతం బళ్లారిలో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. తన కార్యకర్త మృతికి గాలి జనార్దన్ రెడ్డే కారణమని, ఆయన్ను తక్షణమే అరెస్ట్ చేయాలని భరత్ రెడ్డి డిమాండ్ చేశారు.
