తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) శివధర్ రెడ్డిని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో పెండింగ్లో ఉన్న కేసులు మరియు పోలీసు అధికారుల తీరుపై ఆయన డీజీపీకి వినతిపత్రం సమర్పించారు. గతేడాది మార్చిలో కిలా వరంగల్లో జరిగిన గొర్రెల దహనం ఘటనపై ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదని, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని సారయ్య కోరారు. 2023 డిసెంబర్ నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని మూడు పోలీస్ స్టేషన్లలో ప్రముఖులు, సామాన్యులపై అక్రమంగా నమోదైన ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర కేసులపై సమగ్ర విచారణ జరపాలని విన్నవించారు.

రాజకీయ ప్రేరేపిత లేదా తప్పుడు కేసులు పెట్టిన పోలీసు అధికారులపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. గతంలో తప్పుడు కేసులు నమోదు చేసిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నందుకు డీజీపీకి సారయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ చర్యల వల్ల పోలీసులపై ప్రజలకు నమ్మకం పెరిగిందని ఆయన పేర్కొన్నారు.
