దక్షిణ అమెరికా దేశం వెనిజులాలో శనివారం తెల్లవారుజామున పెను ప్రకంపనలు రేగాయి. రాజధాని కరాకస్ లక్ష్యంగా అమెరికా సైన్యం వరుస మిస్సైల్ దాడులకు పాల్పడినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కనీసం ఏడు భారీ పేలుళ్లు సంభవించాయి. కరాకస్‌లోని లా కార్లోటా మిలిటరీ ఎయిర్‌ఫీల్డ్ మరియు నికోలస్ మదురో నివాసముండే ఫ్యూర్టే తియునా మిలిటరీ బేస్‌లపై దాడులు జరిగినట్లు సమాచారం.

ట్రంప్ హెచ్చరిక: మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకే ఈ దాడులు చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అవసరమైతే వెనిజులా గడ్డపై భూతల దాడులకు కూడా వెనకాడబోమని ఆయన హెచ్చరించారు.

దాడుల అనంతరం కరాకస్ నగరంలోని దక్షిణ ప్రాంతం అంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకటిలో మునిగిపోయింది.ఇది తమ సార్వభౌమాధికారంపై అమెరికా చేసిన దురాక్రమణ అని, ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ఈ సామ్రాజ్యవాద దాడిని ఎదిరించాలని వెనిజులా ప్రభుత్వం పిలుపునిచ్చింది.
