ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. బుధవారం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

2014-19 మధ్య తాము 72 శాతం పనులు పూర్తి చేస్తే, గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 2 శాతమే చేసిందని.. వారి నిర్లక్ష్యం వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతిని ఆరేడేళ్ల జాప్యం జరిగిందని మండిపడ్డారు. వచ్చే ఫిబ్రవరి 15 నాటికి డయాఫ్రం వాల్, జూన్ నాటికి ఎంబాంక్మెంట్ పనులు పూర్తి చేస్తాం. వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని పనులనూ కొలిక్కి తెస్తాం. ఎడమ కాలువ ద్వారా విశాఖ, అనకాపల్లి జిల్లాలకు నీరు అందించి సస్యశ్యామలం చేస్తాం. నిర్వాసితులకు పునరావాసం, భూసేకరణ పనులను 12 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీరిచ్చి ఉద్యానవన రంగాన్ని కాపాడామని, పోలవరం పూర్తయితే రాష్ట్రం కరువు రహితంగా మారుతుందని ఆకాంక్షించారు.

“పోలవరం ప్రాజెక్టు నా మనస్సుకు ఎంతో దగ్గరైంది.. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల నిద్రలేని రాత్రులు గడిపాను. ఎలాగైనా దీన్ని పూర్తి చేయడమే నా లక్ష్యం” అని సీఎం చంద్రబాబు భావోద్వేగంగా పేర్కొన్నారు.
