కోనసీమ సంస్కృతికి అద్దం పట్టేలా కొత్తపేట నియోజకవర్గం వానపల్లి శివారు తొత్తుపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ లో సంక్రాంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా పండుగ జరుపుకున్నారు.

కనుమ రోజున కోనసీమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ‘ప్రభల తీర్థం’ను ప్రభుత్వం జాతీయ పండుగ స్థాయి గుర్తింపునిచ్చిన నేపథ్యంలో, విద్యార్థులు స్వయంగా ప్రభలను తయారు చేశారు. విద్యార్థులు, టీచర్లు కలిసి తయారు చేసిన ప్రభలతో గ్రామం అంతా ఊరేగింపుగా వెళ్లారు. హరిదాసుల కీర్తనలు, సంప్రదాయ దుస్తులతో విద్యార్థులు సందడి చేశారు.

పాఠశాల ఆవరణలో విద్యార్థినులు రంగురంగుల ముగ్గులు వేసి పండుగ శోభను తీసుకువచ్చారు. మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉపాధ్యాయులు ఈ సందర్భంగా విద్యార్థులకు వివరించారు.
