“మేం చేస్తే తప్పా? కాంగ్రెస్ నీచ రాజకీయాలు ఆపాలి!”మంత్రి బండి సంజయ్

January 17, 2026 1:51 PM

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వీబీ-జీ రామ్ జీ (Viksit Bharat – Guarantee for Rozgar and Ajeevika Mission – Gramin) పథకంపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “మీరు పేర్లు మార్చితే సంసారం.. మేం చేస్తే వ్యభిచారమా?” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కొత్త పథకం ద్వారా ప్రతి ఒక్కరికీ ఏడాదికి కచ్చితంగా 125 రోజుల పని దొరుకుతుందని, వ్యవసాయ సీజన్ కలిపితే మొత్తం 200 రోజుల ఉపాధి లభిస్తుందని తెలిపారు. వ్యవసాయ సీజన్ సమయంలో 60 రోజుల పాటు పనులను నిలిపివేసే అధికారం రాష్ట్రాలకు ఇచ్చామని, దీనివల్ల రైతులకు కూలీల కొరత ఉండదని వివరించారు. గతంతో పోలిస్తే ఈ పథకం ద్వారా తెలంగాణకు అదనంగా రూ. 340 కోట్లు రాబోతున్నాయని, దేశవ్యాప్తంగా కేంద్రం మరో రూ. 17 వేల కోట్లు అదనంగా వెచ్చిస్తోందని చెప్పారు. ఉపాధి హామీ నుండి గాంధీ పేరు తొలగించడంపై కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని.. గతంలో వాంబే (VAMBAY) పథకాన్ని ఇందిరా ఆవాస్ యోజనగా, ఎన్టీఆర్ ఎయిర్ పోర్టును రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టుగా మార్చిన చరిత్ర కాంగ్రెస్‌దేనని గుర్తు చేశారు. ఈ పథకానికి ఏటా రూ. 1.51 లక్షల కోట్లు ఖర్చవుతాయని, అందులో కేంద్రం వాటా రూ. 95,692 కోట్లు కాగా, రాష్ట్రాల వాటా రూ. 55,589 కోట్లు ఉంటుందని స్పష్టం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media