శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలిపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. శనివారం తిలారు రైల్వే స్టేషన్‌లో బ్రహ్మపూర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ నూతన హాల్టును రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

తిలారులో కొత్త హాల్టుతో పాటు, కోటబొమ్మాళిలో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ హాల్టుకు హామీ ఇచ్చారు. హరిశ్చంద్రపురం స్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. మూలపేట పోర్ట్, కొత్త ఎయిర్‌పోర్ట్, రైల్వే విస్తరణతో శ్రీకాకుళం రూపురేఖలు మారుతాయని, ఇతర ప్రాంతాల వారు ఇక్కడికి వలస వచ్చేలా జిల్లాను అభివృద్ధి చేస్తామని రామ్మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

రైల్వే అండర్ పాస్‌లలో నీరు నిలిచే సమస్య తన దృష్టిలో ఉందని, దీనికి శాశ్వత పరిష్కారం కోసం పార్లమెంట్‌లో గళం ఎత్తుతున్నానని మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 4 గంటల్లోనే రైతులకు నగదు చెల్లిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు పనితీరును రామ్మోహన్ నాయుడు కొనియాడారు. ఎర్రంనాయుడు ఆశయ సాధనే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని ఇద్దరు నేతలు స్పష్టం చేశారు.
