కామారెడ్డి జిల్లాలో అక్రమంగా పేలుడు పదార్థాలను నిల్వ ఉంచి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
రామారెడ్డి మండల కేంద్రంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వెళ్తున్న రాజు, శేషు లాల్ అనే వ్యక్తులను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వారిని విచారించగా, ఎలాంటి అనుమతులు లేకుండా నిజామాబాద్ జిల్లా నందిపేటకు చెందిన వరికుప్పల నర్సింలు వద్ద జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు కొనుగోలు చేసినట్లు అంగీకరించారు.

నిందితుల నుంచి 70 జిలెటిన్ స్టిక్స్, 6 డిటోనేటర్లు, 57 మీటర్ల వైరు, 3 మొబైల్ ఫోన్లు మరియు ఒక ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజు, శేషు లాల్‌తో పాటు ప్రధాన సరఫరాదారు నర్సింలును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు ఓరుసు సాయి మల్లు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. గాంధారి మండలంలోని నివాస ప్రాంతాల మధ్య ఉన్న బండరాళ్లను పేల్చేందుకు వీటిని తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన హోంగార్డ్ కైలాస్‌ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
