జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌పై ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “ప్రజా పాలనను, సంక్షేమ పథకాలను సమర్థిస్తే స్వాగతిస్తాం కానీ.. కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదు” అని హెచ్చరించారు.కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లు ఎవరికి ఇవ్వాలో నిర్ణయించడానికి ఎమ్మెల్యే ఎవరని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. పదేళ్లుగా పార్టీ జెండా మోసిన కార్యకర్తలకే మున్సిపల్ ఎన్నికల్లో ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.

ఏ పార్టీలో ఉన్నాడో తెలియని వ్యక్తి రాజ్యాంగ నిబంధనలు, నైతిక విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బిఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి నడుస్తున్న ఎమ్మెల్యే తీరును ఎండగట్టారు. సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ఉచిత బస్సు, రూ. 500లకే సిలిండర్, సన్న బియ్యం వంటి పథకాలను తాము స్వాగతిస్తున్నామని, అభివృద్ధి కోసం కేంద్ర పాలకులను కలవడంలో తప్పులేదని సమర్థించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాలలోని 50 స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తుందని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా పట్టిన వారికే గుర్తింపు ఉండాలని, వారి హక్కుల కోసం తాను ఎవరితోనైనా పోరాడతానని కుండబద్దలు కొట్టారు.
