ఒడిశాలోని నైనీ(naini) బొగ్గు బ్లాక్ వేలం కోసం సింగరేణి సంస్థ పిలిచిన టెండర్లను రద్దు చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. టెండర్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలను ఆయన ఖండించారు. టెండర్ నిబంధనల ఖరారులో మంత్రులకు ఎటువంటి సంబంధం ఉండదని, ఆ బాధ్యత సింగరేణి బోర్డుదేనని స్పష్టం చేశారు. ఎవరికీ ఎటువంటి సందేహాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే పాత టెండర్లను రద్దు చేసి, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్తగా టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
తాను ఆస్తుల సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజా ఆస్తులను దోపిడీదారుల నుంచి కాపాడటమే తన బాధ్యతని ఆయన ఉద్ఘాటించారు
