ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ స్విట్జర్లాండ్‌లో తన పర్యటనను వేగవంతం చేశారు. మంగళవారం జ్యూరిచ్‌లో భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన లోకేష్.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరించారు. ఫార్మా, మెడికల్ డివైజెస్, హెవీ మెషినరీ, హార్డ్‌వేర్ ఎలక్ట్రానిక్స్, రైల్వే విడిభాగాలు మరియు టెక్నికల్ టెక్స్టైల్స్ రంగాల్లో స్విస్ కంపెనీలను ఏపీకి ఆహ్వానించాలని రాయబారిని కోరారు. నెస్లే, రోచె, నోవార్టిస్, ఎబీబీ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఏపీలో తమ యూనిట్లను నెలకొల్పేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.జ్యూరిచ్, బాసెల్ వంటి ప్రఖ్యాత స్విస్ వర్సిటీలను ఏపీలోని ఏఐ, ఫార్మా కోర్సులతో అనుసంధానించాలని కోరారు. 100 కేజీల బరువు మోసే డ్రోన్లను తయారు చేసే కంపెనీలు ఏపీలో ఉన్నాయని, వాటిని స్విస్ కంపెనీలతో బి2బి (B2B) భాగస్వామ్యం వైపు నడిపించాలని సూచించారు.
గతేడాది చంద్రబాబు పర్యటనతో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేసిన మృదుల్ కుమార్.. తాజా ‘ట్రేడ్ అండ్ ఎకనమిక్ పార్టనర్ షిప్ అగ్రిమెంట్’ (TEPA) ద్వారా ఏపీకి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా సహకరిస్తామని హామీ ఇచ్చారు.
