విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన విద్యాశాఖలో అవినీతి తిమింగలాలు ఏసీబీకి చిక్కాయి. ప్రైవేటు పాఠశాల అప్‌గ్రేడేషన్ ఫైల్ పాస్ చేసేందుకు రూ. 45 వేలు లంచం తీసుకుంటూ జిల్లా విద్యాశాఖ (DEO) కార్యాలయ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.గుర్రంకొండ మండలంలోని ఏబీసీ స్కూల్ కరస్పాండెంట్ శేషాద్రినాయుడు తన పాఠశాలను 7వ తరగతి నుంచి 10వ తరగతికి (High School) అప్‌గ్రేడ్ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఫైల్‌ను ముందుకు పంపేందుకు అధికారులు లంచం డిమాండ్ చేశారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కడప ఏసీబీ డీఎస్పీ సీతారామారావు ఆధ్వర్యంలో అధికారులు మదనపల్లెలోని డీవైఈవో (DyEO) కార్యాలయంలో నిఘా పెట్టారు.జిల్లా విద్యాశాఖ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ (AD) రాజశేఖర్, సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ బాషా (మున్నా) రూ. 45 వేలు తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.నిందితులను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశామని.. వారిని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు.విద్యాశాఖలో అవినీతి రహిత పాలన ఉండాలని మంత్రి లోకేష్ పదేపదే హెచ్చరిస్తున్నా, క్షేత్రస్థాయిలో అధికారుల తీరు మారకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
