కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం మరోసారి రికార్డు సృష్టించింది. బుధవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో కేవలం 34 రోజుల్లోనే స్వామివారికి రికార్డు స్థాయి ఆదాయం లభించింది.భక్తుల మొక్కుల రూపంలో ఏకంగా 2 కోట్ల 5 లక్షల 51 వేల 4 రూపాయల నగదు వచ్చింది.

ఇందులో ప్రధాన హుండీల ద్వారా కోటి 46 లక్షలు రాగా.. అన్నప్రసాదం హుండీల ద్వారా 59 లక్షల రూపాయలకు పైగా ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. నగదుతో పాటు భక్తులు భారీగా బంగారం, వెండిని సమర్పించారు. 26 గ్రాముల బంగారం, కిలో 200 గ్రాముల వెండితో పాటు అమెరికా, ఇంగ్లండ్ సహా 14 దేశాలకు చెందిన 87 విదేశీ కరెన్సీ నోట్లు హుండీలో లభించాయి. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు పర్యవేక్షణలో జరిగిన ఈ లెక్కింపులో.. భక్తుల విశ్వాసంతో ఆలయ అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేస్తామని ధర్మకర్తలు తెలిపారు.

