ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారంలో ఒక వింత ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. టాలీవుడ్ నటి టీనా శ్రావ్య తన పెంపుడు కుక్కకు ‘తులాభారం’ వేసి మొక్కు చెల్లించుకోవడంపై భక్తులు, గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి.
నటి టీనా శ్రావ్య సమ్మక్క-సారలమ్మ ఆలయం వద్ద తన పెంపుడు కుక్క బరువుకు సమానంగా బెల్లాన్ని (బంగారం) తక్కెడలో పెట్టి మొక్కు తీర్చుకున్నారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వివాదం రాజుకుంది. ఆదివాసీ దేవతల వద్ద జంతువులకు తులాభారం వేయడం సంప్రదాయాలను కించపరచడమేనని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నటి క్షమాపణ: వివాదం ముదరడంతో నటి టీనా శ్రావ్య బహిరంగ క్షమాపణలు చెప్పారు. తన పెంపుడు కుక్క అనారోగ్యం నుంచి కోలుకోవాలని మొక్కుకున్నానని, ఆ భక్తితోనే అలా చేశాను తప్ప ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు. భక్తుల మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని కోరారు.
