మూగజీవాల పట్ల మనుషులు తమ క్రూరత్వాన్ని చాటుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పదుల సంఖ్యలో కోతులపై విష ప్రయోగం చేసిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామ శివారులో వెలుగుచూసింది.

44వ జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వీస్ రోడ్డుపై సుమారు 25 కోతులు అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. అందులో అప్పటికే 15 కోతులు మరణించగా, మిగిలినవి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పశువైద్య సిబ్బంది.. బతికి ఉన్న కోతులకు అత్యవసర ఇంజక్షన్లు ఇచ్చి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారు. మరణించిన కోతులను గ్రామస్తులు సమీపంలోనే పూడ్చిపెట్టారు. అటవీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అంతంపల్లి సర్పంచ్ మంజుల ఆవేదన వ్యక్తం చేశారు. వేరే ప్రాంతాల నుంచి కోతులను పట్టుకొచ్చి ఇక్కడ వదిలేస్తున్నారని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు.
