136 ఏళ్ల చరిత్ర గల సింగరేణి సంస్థను గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ అవినీతి అక్రమాలకు కేంద్రంగా మార్చుకున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. నైని కోల్ బ్లాక్ టెండర్లు, సింగరేణి ఆర్థిక పరిస్థితిపై ఆయన నిప్పులు చెరిగారు.
సింగరేణిలో 51 శాతం రాష్ట్ర వాటా ఉండటంతో కేంద్రం జోక్యం లేకుండా పోయిందని, దీన్ని ఆసరాగా చేసుకుని ‘కల్వకుంట్ల కుటుంబం’ సంస్థను విధ్వంసం చేసిందని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి సుమారు రూ. 32,000 కోట్ల బకాయిలు పెట్టిందని, దీనివల్ల బ్యాంకుల్లో అప్పులు తెచ్చి జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒడిశాలోని నైని కోల్ బ్లాక్ కోసం కేంద్రం అన్ని అనుమతులు తెచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ వంటి నిబంధనలతో టెండర్లలో అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు. కోల్ ఇండియాలో టన్ను బొగ్గు ధర రూ. 1,605 ఉంటే, సింగరేణిలో రూ. 4,088గా ఉందని, నాణ్యత తక్కువ-ధర ఎక్కువ కావడంతో ఎన్టీపీసీ వంటి సంస్థలు సింగరేణి బొగ్గును తిరస్కరిస్తున్నాయని తెలిపారు. సింగరేణి అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే కేంద్రం సహకరిస్తుందని స్పష్టం చేశారు. అవసరమైతే టెండర్ల ప్రక్రియపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని నడపలేకపోతే, కేంద్రానికి అప్పగించాలని.. సంస్థను లాభాల బాటలో నడిపే బాధ్యతను కేంద్రం తీసుకుంటుందని కిషన్ రెడ్డి ఆఫర్ ఇచ్చారు.
