తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజులమండ్యం గ్రామ పరిధిలో చారిత్రక నేపథ్యం గల చర్చి ఆస్తులు ఆక్రమణకు గురవ్వడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. సర్వే నెంబర్ 75, 76లో ఉన్న సుమారు 7 ఎకరాల చర్చి భూములను ఓ పారిశ్రామికవేత్త అక్రమంగా చేజిక్కించుకున్నారని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
రూ. 100 కోట్ల భూమి.. రూ. 3 కోట్లకే: మార్కెట్ విలువ ప్రకారం వంద కోట్ల రూపాయలు చేసే ఈ భూమిని, చర్చిలోని కొందరు వ్యక్తులతో కుమ్మక్కై కేవలం రూ. 3 కోట్లకే సదరు పారిశ్రామికవేత్త దక్కించుకున్నారని సమాచారం. చర్చి భూములను కొనుగోలు చేయడమే కాకుండా, రైతుల సంక్షేమం కోసం గోడౌన్లు నిర్మిస్తున్నట్లు నమ్మించి ఒక బ్యాంకు నుండి రూ. 36 కోట్ల రుణం పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ చర్చి ప్రాంగణంలోని వసతి గృహంలోనే భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వంటి ప్రముఖులు చదువుకున్నారు. ఇంతటి చరిత్ర ఉన్న మైనార్టీ ఆస్తులను అమ్మకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా నిబంధనలు ఉల్లంఘించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాజులమండ్యం మాజీ సర్పంచ్ శ్రీరాజ్ ఫిర్యాదు మేరకు రేణిగుంట తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. చర్చి ఆస్తుల క్రయవిక్రయాలు నేరమని, వెంటనే రికార్డులు పరిశీలించి బాధ్యులకు నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు
