తెలుగు సినీ సాహిత్య శిఖరం, పద్మశ్రీ వేటూరి సుందరరామ్మూర్తి 90వ జయంతి వేడుకలను ఈ నెల 29న ఆయన జన్మస్థలమైన పెద్దకళ్లేపల్లిలో ఘనంగా నిర్వహించనున్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మంగళవారం శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి దేవస్థానం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.
అమెరికా వేటూరి సాహిత్య అభిమాన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి. ప్రముఖ రచయితలు బుర్రా సాయి మాధవ్, తిపిర్నేని కళ్యాణ్ చక్రవర్తి మరియు పలువురు సాహితీవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. వేటూరి రాసిన ఆరు సంపుటాల సినీయేతర సాహిత్య అంకితోత్సవంతో పాటు, ఆయన చిరస్మరణీయ గీతాలతో కూడిన ‘సంగీత విభావరి’ ప్రేక్షకులను అలరించనుంది. వేటూరి మన గ్రామ ముద్దుబిడ్డ అని, ఈ సాహితీ మహోత్సవాన్ని జయప్రదం చేయడం మనందరి బాధ్యతని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.
