మారుతున్న కాలానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీలో సంస్థాగత మార్పులు రావాలని, కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తకు ఉన్నత పదవులు దక్కాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో 25 పార్లమెంట్ నియోజకవర్గాల కమిటీల శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు.

ఒకే పదవిలో ఒక వ్యక్తి రెండుసార్ల కంటే ఎక్కువ ఉండకూడదని, ప్రతి పదవికి ‘టర్మ్ లిమిట్’ ఉండాలని లోకేష్ ప్రతిపాదించారు. ఇది పార్టీలో కొత్త నాయకత్వం ఎదగడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. దేశంలో అభివృద్ధి మరియు సంక్షేమానికి చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్ అని కొనియాడారు. ఐటీ రంగాన్ని తెచ్చిన విజన్ ఆయనదని, ఇప్పుడు ఏపీకి వస్తున్న భారీ పెట్టుబడులే దానికి నిదర్శనమని చెప్పారు.
ఏడాదికి కేవలం పెన్షన్ల కోసమే ప్రభుత్వం రూ. 30,000 కోట్లు ఖర్చు చేస్తోందని, డీఎస్సీ ద్వారా 16 వేల ఉద్యోగాలు కల్పించామని వివరించారు.

ఏపీలో ఉన్నది ‘డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్’ సర్కార్ అని, పవనన్న చెప్పినట్లుగా రాష్ట్రాభివృద్ధి కోసం ఈ కూటమి ప్రభుత్వం కనీసం 15 ఏళ్లు అధికారంలో ఉండాలని పిలుపునిచ్చారు. అభివృద్ధికి చంద్రబాబు చిహ్నమైతే.. కల్తీ నెయ్యి, కల్తీ మద్యం, కోడికత్తి రాజకీయాలకు జగన్ అండ్ టీమ్ బ్రాండ్ అంబాసిడర్లు అని ఎద్దేవా చేశారు.
